దారుణం.. ట్రీట్‌మెంట్ కోసం వచ్చి డాక్టర్‪ను కాల్చి చంపారు

చికిత్స కోసం హాస్పిటల్ కు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు డాక్టర్ ను కాల్చి చంపిన దారుణం గురువారం ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలోని నిమా ఆస్పత్రిలో గురువారం తెల్లవారుజామున 2గంటలకు ఈ హత్య జరింగింది. దాదాపు 17 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు ట్రీట్‌మెంట్ కోసం గురువారం అర్థరాత్రి నిమా క్లినిక్ వచ్చారు. వారిలో ఒకరు కాలి గాయంతో ఉన్నారు. గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేయాలని హాస్పిటల్ సిబ్బందిని కోరారు. 

కాలికి కట్టు కట్టించుకున్నాక ఓ యువకుడు డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్లి డాక్టర్ తలకు గన్ గురి పెట్టి కాల్చి చంపాడు. యునాని మెడిసిన్ ప్రాక్టీషనర్ డాక్టర్ జావేద్ అక్తర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు 55 ఏళ్ల డాక్టర్ జావేద్ అక్తర్ గా గుర్తించారు. పోలీసులకు ఈ విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ లో ని సీసీఫుటేజీని పరిశీలించారు. నిందితులు అక్టోబర్ 1న కూడా హాస్పిటల్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీస్ ఫోరెన్సిక్స్ యూనిట్‌ హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరించేందుకు సంఘటనా స్థలానికి చేరుకుంది.

Also Read :- పేల్చేస్తాం.. ఉత్తరాది రాష్ట్రాలకు పాక్ ఉగ్రవాద సంస్థ పేరుతో లేఖలు