లాభాల బాటలో ఖైదీల పెట్రోల్ బంకులు

  • జైళ్ల శాఖ ఆధ్వర్యంలోసంగారెడ్డి జిల్లాలో 2 బంకులు
  • కాశీపూర్, సంగారెడ్డి పాత జైలుప్రాంతాల్లో ఏర్పాటు
  • నెలకు రూ.5 లక్షల వరకు  ఆదాయం
  • రిలీజ్, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి

సంగారెడ్డి, వెలుగు : జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు పెట్రోల్ బంకులు లాభాల బాటలో నడుస్తున్నాయి. తద్వారా ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే దిశగా జైలు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లల్లో ఇప్పటికే స్టీల్ఇండస్ట్రీ, రోజువారి వివిధ ఉత్పత్తి కేంద్రాలు కొనసాగుతుండగా

పెట్రోల్ బంకులు కూడా నడిపిస్తూ ఖైదీల సంక్షేమం కోసం జైళ్ల శాఖ పాటుపడుతోంది. కందిలోని జిల్లా సెంట్రల్ జైలు ఆధ్వర్యంలో కాశీపూర్, సంగారెడ్డి పాత జైలు ప్రాంతాల్లో గతంలో రెండు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి, రిలీజైన ఖైదీలతో పాటు ప్రస్తుతం శిక్ష పొందుతున్న ఖైదీలతో వీటిని నడిపిస్తున్నారు. రిలీజ్ ఖైదీలకు నెలకు రూ.12 వేలు ఇస్తుండగా, శిక్ష పొందుతున్న ఖైదీలకు రూ.4 వేల జీతం చెల్లిస్తున్నారు. 

కాశీపూర్ బంకులో సీఎన్ జీ ఫిల్లింగ్​కూడా..

జిల్లా జైలుకు సమీపంలో ఉన్న కాశీపూర్ ఖైదీల పెట్రోల్ బంకు.. కంది-శంకర్ పల్లి మధ్యలో బెంగళూరు హైవేపై ఏర్పాటు చేశారు. ఇక్కడ నలుగురు ఖైదీలతో పాటు ఇద్దరు జైలు శాఖ సిబ్బంది రెగ్యులర్ గా పనిచేస్తున్నారు. బెంగళూరు హైవేపై ఈ పెట్రోల్ బంకు ఉండడం వల్ల డీజిల్, పెట్రోల్ అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. రోజుకు కనీసం డీజిల్ 3,200 లీటర్లు, పెట్రోల్ 2,200 లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అమ్మకాల ద్వారా జైళ్ల శాఖకు నెలకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

ఇదిలా ఉంటే ఇదే కాశీపూర్ ఐఓసీ బంకులో గ్యాస్ (సీఎన్ జీ) ఫిల్లింగ్ కౌంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఎక్కడా సీఎన్ జీ సౌకర్యం లేకపోవడంతో గ్యాస్ ఫిల్లింగ్ కోసం వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వాహనదారులు గ్యాస్ ఫిల్లింగ్ చేసుకోవడం వల్ల  ఆదాయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

పాత జైలు బంకులో... 

సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలో ఇదివరకు ఉన్న పాత జైలు ప్రాంతంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇక్కడ కూడా నలుగురు ఖైదీలతో పాటు ఇద్దరు రెగ్యులర్ జైలు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడ రోజువారీగా డీజిల్ 2000 లీటర్లు, పెట్రోల్ 1,500 లీటర్ల అమ్మకాలు జరుగుతుండగా, నెలకు ఆదాయం రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షలు ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడ డీజిల్, పెట్రోల్ అమ్మకాలు మరింత పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో ఉపాధి దక్కడంతో పాటు కుటుంబ భారం కూడా తగ్గిందని ఖైదీల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

ఖైదీల సంక్షేమానికి కృషి

కాశీపూర్, సంగారెడ్డి పాత జైలు ప్రాంతంలో ఉన్న 2 పెట్రోల్ బంకుల ద్వారా నెలకు రూ.5 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. వచ్చిన ఆ ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. జైళ్ల శాఖ చేపట్టిన ఫిల్లింగ్ స్టేషన్లలో వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆదాయాన్ని మరింత పెంచేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నాం.

- భరత్ రెడ్డి,  జిల్లా జైలు సూపరింటెండెంట్