విజయనగరం జిల్లా గజపతినగరం దగ్గర ఇవాళ(గురువారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 26వ నెంబరు జాతీయ రహదారిపై ఆగివున్న లారీని విశాఖ నుంచి పార్వతీపురంవైపు కెమికల్ పౌడర్ లోడ్‌తో వెళ్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కెమికల్ లారీలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ రామచందర్‌యాదవ్ (40), క్లీనర్ ప్రకాష్ సింగ్(30) మంటల్లో సజీవదహనమయ్యారు. దీంతో తెల్లవారుజామున 3గంటల నుంచి 6గంటల వరకు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహన రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆగి ఉన్న లారీ కూడా అంతకుముందే ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
