ఏపీలో దారుణం: పెన్షన్ రాలేదని మనస్తాపంతో ఇద్దరు వృద్దులు మృతి..

ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాల పంపిణీని రద్దు చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. వాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే పెన్షన్ పంపిణీని ఈసీ రద్దు చేయటంతో వృద్దులు, వికలాంగులకు ప్రతి నెల 1వ తేదీన అందాల్సిన పెన్షన్ ఆగిపోయింది. సచివాలయాల వద్ద పెన్షన్ కోసం వృద్దులు, వికలాంగులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో పెన్షన్ రాలేదని మనస్తాపంతో ఇద్దరు వృద్దులు మృతి చెందారు.

కాకినాడ రూరల్ తూరంగికి చెందిన 70ఏళ్ళ వృద్ధుడు వెంకట్రావు పెన్షన్ అందలేదని మనస్తాపం చెంది గుండెపోటుకు గురై మృతి చెందాడు. పెన్షన్ పంపిణీ ఆగిన నేపథ్యంలో సచివాలయానికి వెళ్లి విషయాన్ని తెలుసుకోవాలని భావించిన వెంకట్రావు మార్గం మధ్యలోనే గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా వేంకటగిరి బంగారుపేటకు చెందిన 80ఏళ్ళ వెంకటయ్య అనే మరో వృద్ధుడు వలంటీర్ల ద్వారా ఇంటివద్దకు పెన్షన్ అందలేదన్న మనస్తాపంతో గుండెపోటుకు గురై కుప్పకూలి మృతి చెందినట్లు తెలుస్తోంది.