రిమ్స్​లో అరుదైన సర్జరీలు

  • తాజాగా ఓ పేషెంట్​కు బ్రెయిన్ సర్జరీ 
  • రూ.లక్షల్లో ట్రీట్​మెంట్ చేయించుకోలేని పేదలకు వరం
  • అందుబాటులో న్యూరో క్యాన్సర్, బ్రెయిన్ సర్జరీలు 
  • ఏడాదిలో 20కి పైగానే అరుదైన సర్జీలు 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​లో బుధవారం రెండు అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. విలేకరుల సమావేశంలో డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ తలమడుగు మండలం పల్సి కే గ్రామానికి చెందిన నైతం లక్ష్మీబాయి అనే మహిళ తలకు దెబ్బ తగలడంతో తలలో రక్తం గడ్డకట్టి సృహ కోల్పోయింది. ట్రీట్​మెంట్ కోసం రిమ్స్​కు వచ్చిన ఆమెను పరీక్షించిన డాక్టర్లు సక్సెస్​ఫుల్​గా సర్జరీ చేసి ఆ గడ్డను తొలగించారు. న్యూరో సర్జన్ డాక్టర్ విజయ్ మోహన్ రాజు ఆధ్వర్యంలో సర్జరీ జరిగినట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. ఇలాంటి బ్రెయిన్ సర్జరీ రిమ్స్​లో మొదటిసారని తెలిపారు. మారిన పరిస్థితులుపెద్ద ఆపరేషన్ అంటేనే ప్రజలు హైదరాబాద్​కు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది.

 కానీ ఇప్పుడు ఎలాంటి సర్జరీలైనా, ఎమర్జెన్సీ కేసులున్నా రిమ్స్ లోనే ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్యకాలంలో అరుదైన సర్జరీలు విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో వెనుకబడిన ఆదిలాబాద్ లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉండేవి. రిమ్స్ మెడికల్ కాలేజీ వచ్చినప్పటికీ స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడం, వ్యాధులకు సంబంధించిన పరికరాలు లేకపోవడంతో రోగులు హైదరాబాద్​కు వెళ్లేవారు. ఎమర్జెన్సీ కేసులు రిఫర్ చేయడం, నిర్లక్ష్యం కారణంగా రోగులకు సరైన వైద్యం అందేది కాదు. కానీ గతేడాది నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుతోంది. 

ఇటీవల రిమ్స్​లో జరిగిన అరుదైన ఆపరేషన్లు..

    
ఈ ఏడాది జూన్ 17న ఆదిలాబాద్ మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన రంజన అనే మహిళకు కడుపునొప్పితో రిమ్స్​లో చేరారు. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు తన గర్భసంచికి ఆనుకొని ఉన్న 6 కిలోల గడ్డను తొలగించారు. 

Also Read : బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కు నో చెప్పిన కేంద్రం

    
ఈ ఏడాది సెప్టెంబర్ 12న రిమ్స్ హాస్పిటల్లో ఓ రోగికి డాక్టర్లు పక్కటెముకల్లోని క్యాన్సర్ ట్యూమర్ ను తొలగించి సర్జరీని విజయవంతం చేశారు. బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆదిలాబాద్​కు చెందిన అభిషేక్ అనే యువకుడు చికిత్స కోసం రిమ్స్​లో చేరారు. అంకో సర్జన్ జక్కుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృంధం మొదటి సారి గుండెకు, ఊపరితిత్తులకు ఆనుకొని ఉన్న క్యాన్సర్ కణాలను 7 గంటల పాటు కష్టపడి సర్జరీ ద్వారా తొలగించారు. ఇంత పెద్ద ఆపరేషన్ ఇదే మొదటిసారి కాగా ప్రైవేట్ ఈ ఆపరేషన్ కోసం రూ.10 లక్షలు ఖర్చయ్యేదని డాక్టర్లు చెప్పారు. 
    
నవంబర్ 23న ఆదిలాబాద్​కు చెందిన నర్సవ్వ అనే వృద్ధురాలికి మెడలో ఉన్న కణితిని గంటన్నర పాటు శ్రమించి సర్జరీ ద్వారా తొలగించారు. దాదాపు కిలోన్నర బరువు ఉన్న కణితి తీసివేయడం ఇదే మొదటిసారి.  ఇదే ఆపరేషన్  ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేస్తే దాదాపు రూ. 4 లక్షల వరకు ఖర్చు వచ్చేదని డాక్టర్లు పేర్కొన్నారు.  

అరుదైన సర్జరీలు

సూపర్ హాస్పిటల్​లో అరుదైన ఆపరేషన్లు విజయంతమవుతున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్, క్యాన్సర్, కార్డియో, న్యూరో సర్జరీలు ఇక్కడే చేస్తుండడంతో పేదలకు ఆర్థిక భారం తగ్గింది. క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, కీళ్ల మార్పిడీ సర్జరీలు నిత్యం జరుగుతున్నాయి. 20 అరుదైన ఆపరేషన్లు చేశామని, వాటి ఖర్చులు ప్రైవేట్​లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​లో వెయ్యికి పైగానే సర్జరీలు జరిగిగాయి. ఇటీవల ఎమ్మారై స్కానింగ్ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో సేవలు మరింత 
మెరుగుపడ్డాయి.

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

రిమ్స్ లో అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఎప్పుడు చేయని అరుదైన ఆపరేషన్లు సైతం చేస్తున్నాం. క్యాన్సర్, బ్రైయిన్ సర్జరీ వంటి క్రిటికల్ ఆపరేషన్లను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేస్తున్నాం. పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్​లో చేరి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలి.– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్