బైక్​ అదుపు తప్పి కాల్వలో పడి ఇద్దరు మృతి

  • మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ఘటన

నర్సాపూర్, వెలుగు:  మెదక్  జిల్లా నర్సాపూర్  పట్టణ సమీపంలోని రాయారావు చెరువు కాలువలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్​ మండలం కాగజ్ మద్దూర్  గ్రామానికి చెందిన రాములు(43), నర్సింహులు(38) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. మంగళవారం నర్సాపూర్ లో పని ముగించుకొని రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా, రాయారావు చెరువు కాలువ వద్దకు రాగానే బైక్  అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు

. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాములుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉండగా, నర్సింహులుకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.