చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడుప్పుడు అరుదైన చేపలు చిక్కాయి అని వింటూంటాం కదా.. అలాగే తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో కృష్ణా జిల్లా మత్స్యకారులకు అరుదైన కచ్చిడీ చేపలు చిక్కాయి. వాటిని కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో వేలం వేశారు. వీటిని కొనేందుకు వ్యాపారలు ఎగబడ్డారు. ఫైనల్ గా ఓ వ్యాపారి రెండు చేపలకు రూ.4 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు.
అయితే ఈ చేపల్లో అంత స్పెషల్ ఏముందని అనుకోవచ్చు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్(మావ్)ను ఔషధాలకు పొరలా, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారంలా వాడతారని.. అందుకే వీటికి భారీ డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. ఈ చేపల పొట్ట భాగంలో ఉండే అవయవాలకు ఔషద గుణాలుంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ చేపల పొట్టభాగాన్ని బలానికి వాడే మందుల్లో వినియోగిస్తారట. ఇలాంటి చేపలు అరుదుగా మత్సకారుల వలలో పడుతాయని అలాంటప్పుడు వారి పంట పండినట్టే అని అంటున్నారు. వీటిని కొనుగోలు చేసే వారు తినడానికన్నా.. వాటితో వ్యాపారం చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఈ కచ్చడీ చేపలు చాలా అరుదుగా మాత్రమే జాలర్లకు చిక్కుతుంటాయి. సముద్రపు అడుగు భాగంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి.