- టైగర్ కారిడార్ తో పాటు ఎకో టూరిజం అభివృద్ధికి కృషి
- పీసీసీఎఫ్ డోబ్రియాల్
ఆసిఫాబాద్, వెలుగు : పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతో పులి పాత్ర కీలకమని, అలాంటి పులిని కాపాడే బాధ్యత అందరిమీదా ఉందని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్ అన్నారు. కాగజ్ నగర్ అడవుల్లో పులల సంచారం ఎక్కువైందని, ఈ ప్రాంతాన్ని కారిడార్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవల పులి దాడి ఘటనల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆసిఫాబాద్ జిల్లాలో రెండ్రోజుల పర్యటన అనంతరం ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో స్టేట్ వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఈలూ సింగ్ మేరు, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదిలాబాద్ సీసీఎఫ్ రామలింగం, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జిల్లాలో పులుల సంచారం పెరిగిందని, వాటి ఆవాస అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యాల నుంచి ఇక్కడికి పులుల రాక పెరిగిందని, ఆవాసం కోసం వెతుక్కుంటూ కాగజ్ నగర్ అడవిలో ఆవాసం ఏర్పాట్లు చేసుకుంటున్నాయని, అందుకే పులి సంచరానికి అవసరమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఏకో టూరిజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని.. గడ్డి భూముల అభివృద్ధికి, ప్లాంటేషన్ ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తున్నామని అన్నారు.
పులుల పట్ల వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీవో వినయ్ కుమార్ సాహూ, ఎఫ్ ఆర్ వోలు గోవింద్ సింగ్ సర్దార్, సరోజరాణి, జ్ఞానేశ్వర్, జిల్లా అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.