హైదరాబాద్, వెలుగు: టైమ్స్ ప్రాపర్టీ - హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2022 ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ సోమేష్ కుమార్ శనివారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శని, ఆదివారాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్, జయభేరి ప్రాపర్టీస్, రాజపుష్ప ప్రాపర్టీస్ వంటి డెవలపర్లతో పాటు 35 మంది ప్రాపర్టీ డెవలపర్లు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఈ ప్రదర్శనలో భారీ సంఖ్యలో ప్రాపర్టీ డెవలపర్లు పాల్గొనడం ఆసక్తికరంగా ఉందన్నారు. రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని అన్నారు.
2018 ఆగస్ట్ నుంచి రెరాను ప్రారంభించిన తరువాత నుంచి ఇప్పటి వరకు 5,299 లకుపైగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేశామని చెప్పారు. ఈ విషయంలో మనం దేశంలో ఐదవ స్థానంలో ఉన్నామని కుమార్ వివరించారు. రిజిస్ట్రేషన్ల గ్రోత్‌కు సంబంధించి మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే మనకంటే ముందంజలో ఉన్నాయని చెప్పారు. శాంతిభద్రతలు బాగుండటం, తాగునీటి కొరత లేకపోవడం వల్ల సిటీల్లో ప్రాపర్టీలు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులు రావడానికి ఇవన్నీ కారణమేనని కుమార్ వివరించారు. రియల్టీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 9.5 కోట్ల చదరపు అడుగుల్లో నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చామని కుమార్ పేర్కొన్నారు.
