- 14 మున్సిపాలిటీల్లో 52 జీపీలను కలిపిన సర్కార్
- స్పెషల్ ఆఫీసర్ల ప్లేస్‌లో కమిషనర్ల పాలన
- 14 మున్సిపాలిటీలను గ్రేటర్లో కలిపేందుకు యత్నాలు
- అదే జరిగితే జీహెచ్ఎంసీలో పెరగనున్న డివిజన్లు
- విలీనం చేయకపోతే 14 చోట్ల మారనున్న చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లు
- ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ శివారులో ఉన్న మున్సిపాలిటీలను గ్రేటర్ లో కలుపుతారా.. లేదంటే మున్సిపాలిటీలుగానే ఉంచుతారా.. అన్నదానిపై జంట నగరాల్లో చర్చ జరుగుతున్నది. గ్రేటర్ లో కలిపితే ఇప్పుడు జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉండగా వాటి సంఖ్య పెరుగుతది. ఇటీవల సిటీ శివారులో ఉన్న 52 గ్రామ పంచాయతీలను (251 వార్డులు) 14 మున్సిపాలిటీల్లో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మున్సిపాలిటీల విస్తీర్ణం, జనాభా పెరిగింది.
ఆ గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుండగా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ల ఆధీనంలోకి ఆ గ్రామ పంచాయతీలు వెళ్లాయి. జీపీలను విలీనం చేసిన మున్సిపాలిటీల్లో పెద్ద అంబర్ పేట, శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూముకుంట, తెల్లాపూర్, అమీన్ పూర్ ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని రికార్డులను ఇప్పటికే మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డిసెంబర్ లో ముగియనున్న టర్మ్
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల టర్మ్ ఈ ఏడాది డిసెంబర్ లో ముగియనున్నది. కొత్త ఏడాదిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యాక మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ 14 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపితే గ్రేటర్ లో డివిజన్ల సంఖ్య పెరగడంతో పాటు మున్సిపాలిటీల సంఖ్య తగ్గుతాయి. తగ్గకపోతే ఈ మున్సిపాలిటీల్లో 52 గ్రామ పంచాయతీలు విలీనం అయినందున కొత్తగా మున్సిపాలిటీ పరిధి, జనాభా పెరగడంతో చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లు మారుతాయి. దీనికి సుమారు మూడు నెలల టైమ్ పడుతుందని మున్సిపల్ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ వ్యవహారంపై త్వరలోనే క్లారిటీ వస్తదని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు.
కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు
ఇదిలా ఉండగా, ఈ 14 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలపడం కంటే కొత్తగా సిటీ శివారులో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే బెటర్ అనే చర్చ కూడా జరుగుతున్నది. ఎందుకంటే మేడ్చల్, ఘట్కేసర్, అబ్దుల్లాపూర్ మేట్ నుంచి జీహెచ్ఎంసీకి రావాలంటే ప్రజలకు ఎక్కువ టైమ్ పడ్తది. దీనికితోడు డబ్బులు ఖర్చవుతాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒక వేళ కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించకపోతే శివారులో ఉన్న కార్పొరేషన్లను ఈ 14 మున్సిపాలిటీలను కలిపే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే జీహెచ్ఎంసీ లో 150 డివిజన్లు ఉన్నాయి. ఇంకా డివిజన్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించదని మున్సిపల్ అధికారులు అంటున్నారు.
స్పీడ్‌గా డెవలప్
మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనం తర్వాత డెవలప్ మెంట్ స్పీడప్ కానున్నది. సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీల నుంచి పాలన మొత్తం కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఆధీనంలో వెళ్తది. దీంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, స్ట్రీట్ లైట్లు, మార్కెట్లు, సీసీ రోడ్లు తర్వగా వేస్తరు. పంచాయతీలతో పోలిస్తే మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఫండ్స్ ఎక్కువ ఇవ్వనున్నది. ఇప్పటి దాకా ఈ 14 మున్సిపాలిటీల్లో డెవలప్ మెంట్ సాగుతుండగా కొత్తగా విలీనమైన 52 గ్రామ పంచాయతీలపై పాలక వర్గం ఎక్కువ ఫోకస్ పెట్టనున్నది.
