వారంలో రెండు సార్లు.. తెలంగాణ లీడర్ల లేఖలకు టీటీడీ అనుమతి!

  • వారానికి రెండు సార్లు సిఫార్సు లెటర్లు తీసుకోవాలని నిర్ణయం
  • త్వరలో అధికారికంగా ప్రకటించనున్న ఏపీ సీఎం
  • నాలుగేండ్లుగా తిరుమలలో చెల్లని తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లు

హైదరాబాద్, వెలుగు: వారానికి రెండు సార్లు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయాన్ని త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటిస్తారని టీటీడీ వర్గాల సమాచారం. అయితే రెండు రోజులు కాకుండా 4 లేదా 5 రోజులు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరనున్నట్లు తెలిసింది. తెలంగాణ నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివెళ్తారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి టీటీడీలో తెలంగాణ నేతలు ఇచ్చిన లెటర్లు చెల్లడం లేదని భక్తుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. 

గత నాలుగేండ్ల నుంచి ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చినా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లు అంగీకరించాలని ఎన్నో సార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు కోరినా టీటీడీ పట్టించుకోలేదు. గత ఏడాది నుంచి తిరుమలలో తెలంగాణ లెటర్లు అంగీకరించాలని నేతలు పదే పదే కోరుతున్నారు. ఇటీవల టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు.. తెలంగాణ సీఎంను, మంత్రులను కలిసినప్పుడు వారు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.