ఆంధ్రా తెలంగాణ సరిహద్దులో ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు జిల్లా ఎస్పీ పక్కీరప్ప
కర్నూలు: ఆంధ్ర–తెలంగాణ సరిహద్దుగా ఉన్న తుంగభద్ర నదికి వచ్చే నవంబర్ లో పుష్కరాలు జరగనున్నాయి. నవంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 1 వరకు జరుగుతాయి. కరోనా వ్యాప్తి ప్రభావం అప్పటి వరకు ఎలా ఉంటుందోనన్న సందేహాలు అంచనాలకు అందడం లేదు. ఈ నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు మంగళవారం కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తుంగభద్ర నది పరివాహక ప్రాంతాలను సందర్శించారు. ప్రస్తుతం వాన నీరు తప్ప వరద ప్రవాహం ఇంకా మొదలు కాలేదు. వరద వచ్చేలోపు ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించేందుకు స్థానిక ప్రజలతో కూడా మాట్లాడారు. నవంబర్ లోపు కరోనా ప్రభావం తగ్గితే సరి.. లేకపోతే ఏం చేయాలనే దానిపై స్థానికులతో మాట్లాడి సూచనలు అడిగారు. తుంగభద్ర నదికి ఇరువైపులా ఆంధ్ర–తెలంగాణ ప్రజలు అటు.. ఇటు నదిని దాటే ప్రాంతాలను పరిశీలించారు. 2008లో వచ్చిన పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన స్నానాల ఘాట్లను చూశారు. తుంగభద్ర నదికి గరిష్టంగా ఎంత మేర వరద వస్తుంది.. సగటు వరద వస్తుందా.. ఎక్కువ వస్తుందా.. తక్కువ వస్తుందా.. ఇలా అన్ని రకాల అంచనాలతో ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు. సుంకేశుల రోడ్డు, మాసా మసీదు, పంప్ హౌస్, అమీర్ హైదర్ ఖాన్ నగర్, సంకల్ బాగ్ ఘాట్ల వద్ద ప్రస్తుతం ఉన్న ఘాట్ల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. తుంగభద్ర నదికి ఇరువైపులా ఆంధ్ర –తెలంగాణ సరిహద్దులోని పంచలింగాల, ఈ.తాండ్రపాడు, పేపర్ మిల్, గొందిపర్ల గ్రామాల వద్ద పుష్కర స్నానాల రద్దీని క్రమబద్దీకరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రూట్ మ్యాప్ ను సిద్దం చేయాలని సంబంధిత సంబంధిత పోలీసు స్టేషన్లకు ఆదేశాలిచ్చారు. తుంగభద్ర నదికి ఇరువైపులా అటు.. ఇటు తిరిగే తెలంగాణ, ఆంధ్ర ప్రజల రాకపోకలపై సీసీ కెమెరాల నిఘాతోపాటు.. భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని జిల్లా ఎస్పీ పలు సూచనలు ఇచ్చారు.

