కోరిన కోరికలు తీర్చే.. కలియుగ ప్రత్యేక్షదైవం వెంకటేశ్వర స్వామి కొలువైన ఆ ఏడుకొండలు.. ఎన్నో తీర్థాలకు, పవిత్ర ప్రదేశాలకు నిలయం. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవిలో కొలువైన తీర్థాల్లో తుంబుర తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలోనే.. తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి.
తుంబురు తీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది. ఆది, సోమవారాల్లో (2024 మార్చి 24,25) రెండ్రోజుల పాటు తుంబురు ముక్కోటి ఉత్సవాన్ని నిర్వహించింది టీటీడీ. ఈ సందర్భంగా 24 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందించింది. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచింది. మరోవైపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ సైతం ఘనంగా నిర్వహించారు.