తిరుమల తిరుపతి దేవస్థానం మే నెలకు సంబందించిన ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేసింది. ఉదయం 10గంటల సమయంలో బుకింగ్స్ మొదలవ్వగా కేవలం 3నిమిషాల్లోనే మొత్తం టికెట్లు బుక్ అయ్యాయి. అలాగే వర్చువల్ సేవలకు సంబందించిన టికెట్లను మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షణం టోకెన్లను 23న ఉదయం 10గంటలకు, శ్రీవాని ట్రస్ట్ మే నెల టికెట్లను 11గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
మే నెలకు గాను స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను 24న ఉదయం 10గంటలకు, వసతి గదులకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనుంది. కాగా, ప్రస్తుతం తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండగా, బుధవారం 69,191మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,295 మంది తలనీలాలు సామర్పించారు. కానుకల రూపంలో వచ్చిన హుండీ ఆదాయం 3.60కోట్ల రూపాయలుగా నమోదయ్యింది.