కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో మే 3వ తేదీ వరకు భక్తులకు దర్శనం నిలిపివేశారు. అదేవిధంగా ఆలయంలో అన్నిరకాల ఆర్జిత సేవలను TTD రద్దు చేసింది. ఈ క్రమంలో మార్చి 13 నుండి మే 31వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా గానీ, పోస్టాఫీసుల ద్వారా గానీ శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఆర్జిత సేవలను గానీ, దర్శన టికెట్లను గానీ బుక్ చేసుకున్న భక్తులు సంబంధిత టికెట్ వివరాలతోపాటు, బ్యాంకు ఖాతా నంబర్, IFSC కోడ్ వివరాలను helpdesk@tirumala.org మెయిల్ ఐడికి పంపాలని TTD కోరుతోంది. IT విభాగం ఆధ్వర్యంలో ఈ వివరాల ఖచ్చితత్వాన్ని పరిశీలించిన తర్వాత రీఫండ్ మొత్తాన్ని నేరుగా భక్తుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

