శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవాణి ట్రస్టు దాతల ఆఫ్ లైన్ టికెట్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు విరాళం అందించేవారికి 500 రూపాయలు అదనంగా చెల్లిస్తే శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ రెండింటిలోనూ ఈ విధానం అమల్లో ఉంది. కొత్తగా తిరుపతి విమానాశ్రయంలోను శ్రీవాణి ట్రస్టు డొనేషన్ కౌంటర్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సిఫార్సు లేఖల ద్వారా అనుమతించే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన కారణంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సిఫార్సు లేఖల ద్వారా దర్శనానికి అనుమతుల రద్దు కారణంగా భక్తులు ఇబ్బంది పడకుండా శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల కోటాను పెంచుతూ టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 20 నుంచి 24వ తేదీవరకూ సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటలవరకూ పుష్కరిణిలో స్వామివారు విహరిస్తారు.తెప్పోత్సవాల కారణంగా ఈ నెల 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపింది.