వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ తొమ్మది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కాకుండా మిగిలిన రకాలు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని.. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని సహకరించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయాలు ఇవే:
- దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు. కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.
- చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.
- ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు.
- భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు.
- గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.
- భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.
- మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు.
- 3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది.