తిరుపతి వెంకన్న దర్శనానికి బారులు తీరుతున్న భక్తులు

తిరుపతి వెంకన్న దర్శనానికి బారులు తీరుతున్న భక్తులు

కౌంటర్ల దగ్గర ఈనెల 17వ తేదీ వరకు ఉచిత దర్శనం టోకెన్ల జారీ

తిరుపతి: తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. రేపటి నుండి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ పాలక మండలి  ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూ.. శ్రీవారి దర్శనం చేసుకునేలా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇవాళ్టి నుండే టికెట్లు జారీ చేస్తోంది.  తిరుపతిలోని మూడు ప్రాంతాలలో గల 18 కౌంటర్లలో ప్రతి రోజు 3 వేల ఉచిత దర్శన టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది. విష్ణు నివాసం వద్ద 8 కౌంటర్లు, శ్రీనివాసం దగ్గర 6 కౌంటర్లు, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో 4 కౌంటర్ల ద్వారా ఉదయం 7.30 గంటల నుండి టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.

ఊహించని రీతిలో భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుండే కౌంటర్ల వద్ద భారీ సంఖ్యలో బారులు తీరారు. ప్రతి రోజు 3వేల 750 చొప్పున ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా..  భక్తులు నాలుగు రెట్లు ఎక్కువగా వచ్చారు. వచ్చిన వారందరినీ నిరాశ పరచకుండా ఈనెల 14వ తేదీ వరకు ఉన్న దర్శన టోకెన్లను జారీ చేశారు. రోజుకు 3,750  మంది చొప్పున దర్శనం చేసుకునేలా టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇవాళ్టి మాదిరే భక్తులు భారీగా వస్తే జూన్ 17వ తేదీ వరకు ఉన్న ఉచిత దర్శనం కోటా టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది టీటీడీ దేవస్థానం. స్వామి వారిని దర్శించుకునేందుకు టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయంలో మాత్రమే శ్రీ వారి దర్శనానికి రావాలని టీటీడీ ప్రకటించింది.