తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏ ఎంక్వైరీకి అయినా రెడీ.. టీటీడీ మాజీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి..

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన షాకింగ్ కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏ ఎంక్వైరీకి అయినా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోపణలపై తాను కుటుంబంతో సహా ప్రమాణం చేస్తానని, చంద్రబాబు కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రమాణానికి చంద్రబాబు రాకపోతే చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. అత్యంత పవిత్రమైన తిరుమల వెంకటేశుడి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బాధాకరమని అన్నారు. తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని మండిపడ్డారు.

తిరుమలలో స్వామివారి నైవేద్యం కోసం వాడే సామాగ్రిని సాధారణ మార్కెట్ నుండి కాకుండా ఆర్గానిక్ పద్దతిలో ప్రత్యేకంగా పండించే రైతుల దగ్గర నుండి కొనుగోలు చేస్తారని అన్నారు. నెయ్యి విషయంలో కల్తీకి ఎక్కడా తావు లేకుండా రాజస్థాన్ లోని దేశీ ఆవుల గోశాల నుండి తెప్పిస్తారని స్పష్టం చేశారు.