తిరుపతి: తిరుమల వెంకన్న దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న భక్తులకు శుభ వార్త ప్రకటించింది టీటీడీ పాలక మండలి. ఈనెల 11 నుండి సామాన్య భక్తులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూ.. శ్రీవారి దర్శనం చేసుకునేలా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఒకరోజు ముందే అంటే రేపట్నుండే టికెట్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుపతిలోని మూడు ప్రాంతాలలో గల 18 కౌంటర్లలో ప్రతి రోజు 3 వేల ఉచిత దర్శన టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది. విష్ణు నివాసం వద్ద 8 కౌంటర్లు, శ్రీనివాసం దగ్గర 6 కౌంటర్లు, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7.30 గంటల నుండి టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఒక రోజు ముందుగానే తిరుపతిలో దర్శనం టికెట్లు పొందాల్సి ఉంటుంది. భక్తులు తమకు కేటాయించిన సమయంలో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని టీటీడీ సూచిస్తోంది.
