మేడం..టీటీడీ లోని పాతనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా అనుమతివ్వండి ప్లీజ్

మేడం..టీటీడీ లోని పాతనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా అనుమతివ్వండి ప్లీజ్

తిరుమ‌ల శ్రీవారికి భ‌క్తులు హుండీ ద్వారా కానుక‌లుగా స‌మ‌ర్పించిన రూ.500 , రూ.1000 నోట్ల‌ను రిజ‌ర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇత‌ర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయ‌డానికి అనుమ‌తించాల‌ని వైవి సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం 2016లో రూ.1000 , రూ.500 నోట్ల‌ను ర‌ద్దు చేసినప్ప‌టి నుంచి టీటీడీ న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డానికి అనేక ఏర్పాట్లు చేసింద‌న్నారు. అయితే భ‌క్తులు ఆ త‌రువాత కూడా స్వామివారికి హుండీ ద్వారా ర‌ద్దు అయిన నోట్లు కానుక‌గా స‌మ‌ర్పిస్తూ వ‌చ్చార‌న్నారు.

భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డిన అంశం కావ‌డంతో భ‌క్తులు ఈ నోట్ల‌ను హుండీలో స‌మ‌ర్పించ‌కుండా నిరోధించే ఏర్పాట్లు టీటీడీ చేయ‌లేక‌పోయింద‌ని ఆయ‌న చెప్పారు. ఈ ర‌కంగా భ‌క్తుల నుండి 1.8 ల‌క్ష‌ల రూ.1000 నోట్లు, 6.34 ల‌క్ష‌ల రూ.500 నోట్లు హుండీ ద్వారా కానుక‌లుగా వ‌చ్చాయ‌న్నారు.

అనేక బ్యాంకుల్లో లావాదేవీలు జ‌రుపుతున్న టీటీడీ హుండీ ద్వారా ల‌భించే కానుక‌ల‌కు ప‌క్కాగా రికార్డులు నిర్వ‌హిస్తోంద‌ని సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రికి వివ‌రించారు. టీటీడీ వ‌ద్ద నిల్వ ఉన్న ఈ నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేయ‌డం ద్వారా ల‌భించే సొమ్ముతో మ‌రిన్ని ధార్మిక‌, సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

పాత‌నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి 2017 నుంచి టీటీడీ అనేక‌సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌, రిజ‌ర్వు బ్యాంకుకు లేఖ‌లు రాసి విజ్ఞ‌ప్తి చేసినా సానుకూల స్పంద‌న రాలేద‌ని, పాత నోట్లను బ్యాంక్ లో డిపాజిట్ చేసేలా అనుమతివ్వాలని వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్‌ ను కోరారు.

జీఎస్టీని ర‌ద్దు చేయండి

తిరుమ‌ల ఆల‌య భ‌ద్ర‌త కోసం నియ‌మించుకున్న స్పెష‌ల్ ప్రొట‌క్ష‌న్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్‌) విభాగానికి 2014, ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30వ తేదీ వ‌ర‌కు బ‌కాయి ఉన్న రూ.23.78 కోట్ల జీఎస్టీని ర‌ద్దు చేయాల‌ని టీటీడీ ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్‌కు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో ఆయ‌న కేంద్ర మంత్రిని క‌లిసి ఈ మేర‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. జీఎస్టీ రద్దు చేయడం వల్ల టీటీడీ కి మరింత ఆర్థిక బలం లభించి అనేక సామాజిక, విద్య, ధార్మిక కార్యక్రమాలను మరింత ఎక్కువగా నిర్వహించే అవకాశం కలుగుతుందని సుబ్బారెడ్డి కోరారు.