తిరుమల శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. తిరుమల కొండపై డ్యూటీలు చేస్తున్న టీటీడీ ఉద్యోగులు, భద్రతా సిబ్బందితో పాటు అర్చకుల్లో పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో భక్తుల దర్శనాలు రద్దు చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే భక్తుల దర్శనాలకు ఎలాంటి ఆటంకం ఉండదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొండపై భక్తుల ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని తాము నిర్ధారణకు వచ్చామని ఆయన అన్నారు. తిరుమల వచ్చే ప్రతి భక్తుడిని అలిపిరి వద్ద స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నామని, అలాగే ర్యాండమ్ శాంపిల్స్ సేకరించి కరోనా టెస్టులు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్క భక్తుడికీ పాజిటివ్ రాలేదన్నారు.
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కొనసాగుతుందని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అయితే తిరుపతి పట్టణంలో కరోనా కేసుల పెరిగిన కారణంగా నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్ బుకింగ్ నిలిపివేశామని తెలిపారు. తిరుపతికి వచ్చి ఆఫ్‌లైన్‌లో దర్శనం టికెట్లు తీసుకోవాలనుకునే వారు ఎవరూ రావొద్దని సూచించారు. అలాగే కంటైన్‌మెంట్ జోన్లలో ఉండే వారు తిరుమలకు రావొద్దని వైవీ సుబ్బారెడ్డి కోరారు. కరోనా బారినపడిన అర్చకులు, ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, భక్తుల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు.
