ఈ ఏడాది భక్తుల్లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఈ ఏడాది భక్తుల్లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల: సెప్టెంబరు 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…కరోనా కారణంగా స్వామివారి వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించే పరిస్థితి లేదన్నారు. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని, అక్టోబర్‌లో ఉత్సవాల సమయానికి కరోనా ప్రభావం తగ్గితే యథాతథంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.

బర్డ్‌ ఆసుపత్రిలో నూతన గదుల నిర్మాణానికి రూ.5.5కోట్లు, విశాఖలోని ఆలయానికి రహదారి కోసం రూ.4.5 కోట్లు మంజూరు చేసినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. కరోనా బారిన పడిన టీటీడీ ఉద్యోగుల వైద్య ఖర్చులు టీటీడీ భరించాలని పాలకమండలి నిర్ణయించిందన్నారు.

TTD chairman YV Subba Reddy said the Srivari Brahmotsavam would be held in solitude