తిరుమల: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించాలని నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జనవరి 6, 7 తేదీల్లో ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం అన్నమయ్య భవన్‌లో జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారాలను 10 రోజులు తెరిచి దర్శనం కల్పించాలని కోరుతూ తాళ్లపాక రాఘవ అనే భక్తుడు హైకోర్టులో పిల్ వేశాడని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. దీనిపై 6వ తేదీలోపు టీటీడీ అభిప్రాయం చెప్పాలని కోర్టు ఆదేశించడంతో ఇవాళ (ఆదివారం) సమావేశమై అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నామని తెలిపారాయన. సంప్రదాయం, ఆగమ శాస్త్ర ప్రకారం రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరవాలని పండితులు సూచించినట్లు చెప్పారు.
ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ఉచితం
శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేయాలని కూడా తమ భేటీలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. ఈ నెల 20 నుంచి ఈ విధానం అమల్లోకి తెస్తామన్నారు. ఇప్పటి వరకు తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు మాత్రమే ఉచితంగా లడ్డూ ఇచ్చే సంప్రదాయం ఉందని, ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ఉచితంగా అందించాలని నిర్ణయించామని చెప్పారు. సిఫారసు లేఖలతో పని లేకుండా.. రూ.50 చొప్పున భక్తులకు కావాల్సినన్ని అదనపు లడ్డూలు తీసుకోవచ్చన్నారు.
