తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​...బ్రేక్​ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

వరుస సెలవులు వస్తే చాలు తిరుమల కొండ కిక్కిరిసి పోతుంది.   ఇక వేసవి సెలవులు అంటే చెప్పే పనే లేదు.  స్వామిని దర్శించుకునేందుకు .. సామాన్య భక్తులు  వెయిటింగ్​ హాల్స్​ లో ఎదురు చూస్తుంటారు.   అయితే వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీడీడీ గుడ్​ న్యూస్​ చెప్పింది.  

వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వీఐపీ బ్రేక్​ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.  మూడు నెలల పాటు.. అంటే ఏప్రిల్​, మే, జూన్​ నెలల్లో వీఐపీ బ్రేక్​ దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. రానున్న మూడు నెలలపాటు వేసవి సెలవుల్లో  భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని భారీ ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయాలని టీటీడీ బోర్డు తీర్మానించిందని, తద్వారా సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయం లభిస్తుందని తెలిపారు.


సామాన్య భక్తుల సౌకర్యార్థం సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం ఇస్తూ సిఫార్సు లేఖల ఆధారంగా వీఐపీ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది.  క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లు, బయటి లైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక మాడవీధుల్లో కూల్  పెయింటింగ్ తో పాటు త్రాగునీటి సౌకర్యాలు  కల్పించనున్నారు. 

వేసవి రద్దీలో భక్తులకు సహాయం అందించడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ తో పాటు 2500 శ్రీవారి సేవకులను నియమించారు. శేషాచల అటవీ ప్రాంతాల్లో సమ్మర్ లో ఆకస్మిక అగ్నిప్రమాదాలను నివారించడానికి టీటీడీ అటవీ శాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖ సంయుక్తంగా రివ్యూ చేయడంతో పాటు  వేసవిలో నీటి ఎద్దడి దృష్ట్యా నీటిని వృథా చేయకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు టీడీపీ విజ్ఞప్తి చేసింది