న్యూ ఇయర్ షాక్ : హైదరాబాద్ సిటీలోని.. ఓ పెద్ద పబ్ లో డ్రగ్స్ పట్టివేత..

న్యూ ఇయర్ సందర్భంగా హైద్రాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందని సమాచారం తో గత రెండు మూడు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా టీఎస్ నాబ్ (యాంటీ నార్కోటిక్స్) పోలీసులు గచ్చిబౌలి లోని పలు హోటళ్లు, పబ్ లలో  తనిఖీలు చేప్పట్టారు. కొండాపూర్ మస్జీద్ బండ లోని మాయ కన్వెన్షన్ పక్కన ఉన్న క్వాక్ అరేనా పబ్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని సమాచారం అందుకున్న  టీఎస్ నాబ్ పోలీసులు.. ఈవెంట్ కు వచ్చిన కస్టమర్లకు డ్రగ్ టెస్ట్ లు నిర్వహించారు. 

 తనిఖీల్లో డ్రగ్స్ సేవించినట్లు తేలడంతో  ఏడుగురిని TS NAB పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. నిందితులు ఈవెంట్ లో డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట డ్రగ్స్ తీసుకుని ఈవెంట్ కు వచ్చారా అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. హైద్రాబాద్ తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం ఎక్కడ ఉన్నా ఉపేక్షించవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యూఇయర్ సందర్భంగా డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉండొచ్చన్న అనుమానాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో రూ.1.60 లక్షల విలువైన మద్యం బాటిళ్లు సీజ్

అదే సందర్భంలో న్యూ ఇయర్ వేడుకల కోసమని తరలిస్తున్న అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడం పల్లి చెక్ పోస్ట్ వద్ద  రూ.1.60 లక్షల విలువైన 64మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఆబ్కారి శాఖ అధికారులు. గోవా నుండి కారు లో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను సీజ్ చేసి నలుగురిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు.