అసలైన ప్రజాస్వామ్యం ఏంటో మోడీ తెలుసుకోవాలి

అసలైన ప్రజాస్వామ్యం ఏంటో మోడీ తెలుసుకోవాలి
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాన్ని, చలిని సైతం లెక్క చేయకుండా 39 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారని.. వారి ఆందోళనలు అర్థం చేసుకోవాలన్నారు. ‘ప్రభుత్వ కఠిన వైఖరి వల్ల 50 మందికి పైగా రైతులు చనిపోయారు. వారిలో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మోడీ సర్కార్‌‌ను కదిలించలేకపోయింది. అన్నదాతలు చనిపోతున్నా మంత్రులెవరూ నివాళులు కూడా అర్పించలేదు. చనిపోయిన రైతులకు నా నివాళులు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అన్నం పెట్టే రైతన్నలను పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రభుత్వం ఇదే. రైతులు అలసిపోయి నిరసనలను ముగించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం తన అహంకారాన్ని పక్కనబెట్టి నిరసనలకు ముగింపు పలికేలా చూడాలి. రైతులు, శ్రామికుల ఆసక్తులను కాపాడటమే అసలైన ప్రజాస్వామ్యం అని మోడీ గవర్నమెంట్ తెలుసుకోవాలి’ అని సోనియా పేర్కొన్నారు.