తెలంగాణకు అన్ని విషయాల్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు టీఆర్ఎస్ లోక్ సభాపక్షనేత నామానాగేశ్వర్ రావు. దేశంలో తెలంగాణ లేదా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనచేశారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు నిరసన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నామానాగేశ్వర్ రావు..తెలంగాణ పట్ల కేంద్రం అన్ని విషయాల్లో వివక్ష చూపుతోందన్నారు. దేశంలో 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి ఒక్క నవోదయ స్కూల్ లేదన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రతి జిల్లాకు ఒకటివ్వాలన్నారు. గత 8 ఏళ్లల్లో 7 ఐఐఎంలు, 157 మెడికల్ కాలేజీలు ఇస్తే రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదన్నారు. చిన్న రాష్ట్రమైన అసోంకి 27 నవోదయ స్కూల్స్ ఇచ్చారన్నారు. తెలంగాణ సమస్యలపై మోడీకి సీఎం కేసీఆర్ ఎన్ని లేఖలు రాసినా..కలిసినా స్పందించలేదన్నారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యలపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని అన్నారు.
