నవల లాంటి సినీ చరిత్ర : త్రివిక్రమ్

ప్రముఖ సినీ విమర్శకుడు, నంది పురస్కార గ్రహీత డా.రెంటాల జయదేవ రాసిన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ అనే పుస్తకావిష్కరణ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌‌లో జరిగింది. దర్శకులు త్రివిక్రమ్ ముఖ్య​అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘నేను చరిత్రలో వీక్ కనుక పరిశోధనాత్మక గ్రంథాలు చదవను. కానీ ఈ పుస్తకంలో 200 పేజీలు చదవానంటే.. అది జయదేవ గొప్పతనమే.  దక్షిణ భారతీయ భాషల తొలి టాకీల తాలూకా కథ చెప్పాడు. నోస్టాల్జియా మూమెంట్స్ క్యాప్చర్ చేసేలా ఓ పరిశోధనాత్మక గ్రంథం రాయడం కష్టం.

ఇదొక నవల లాంటి పుస్తకం. ఎవరికీ తెలియని సమాచారంతో పాటు మూకీల కోసం వేసిన గుడారాలు, మట్టిలో కూర్చుని నేల థియేటర్లలో సినిమాలు చూడటం లాంటి అనుభూతిని పంచారు’ అని చెప్పారు.  రచయిత రెంటాల జయదేవ మాట్లాడుతూ ‘మూడున్నర దశాబ్దాల నుంచి సినిమాల గురించి రాస్తున్నా.  ఇదే నా తొలి సినిమా పుస్తకం. నేను పుస్తకం రాయకపోతే మాట్లాడనని మా అక్క చెప్పడంతో, కాస్త ఆలస్యంగానైనా నా మాట నిలబెట్టుకున్నా.

ఆత్మీయులు త్రివిక్రమ్ ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది’ అన్నారు.  భాష - సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య డి. చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ కవి అఫ్సర్, రచయిత్రి కల్పనా రెంటాల, దర్శకులు దశరథ్ తదితరులు పాల్గొన్నారు.