బుక్ ఫెయిర్​లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

  • రెంటాల జయదేవ రాసిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ ఆవిష్కరణ

ముషీరాబాద్, వెలుగు: ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉత్సాహంగా కొనసాగుతున్నది. క్రిస్మస్ సెలవు కావడంతో బుధవారం సందర్శకుల తాకిడి పెరిగింది. తన పాతికేళ్ల సినీ పరిశోధనపై రచయిత రెంటాల జయదేవ రాసిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ పుస్తకాన్ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. సినిమాలంటే బాగా పిచ్చి ఉన్న జయదేవ మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. 

అనంతరం బుక్ ఫెయిర్​లోని అన్ని స్టాళ్లను త్రివిక్రమ్ సందర్శించి, అవసరమైన పుస్తకాలు కొన్నారు. పాలపిట్ట ప్రచురణలో లేదాళ్ల రాజేశ్వరరావు రాసిన ‘రంగు పూల ముఖాలు’ పుస్తకాన్ని ప్రముఖ కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఆ తర్వాత జరిగిన పుస్తక స్ఫూర్తి కార్యక్రమంలో వాగ్గేయకారుడు గోరంటి వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదో తరగతి వరకు తాను పెద్దగా పుస్తకాలు చదవ లేదని, విరాట్ నవల తనని ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. బాలోత్సవ్ ఆధ్వర్యంలో పులువురు చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.