త్రిపుర నూతన సీఎం ఖరారు

త్రిపుర నూతన సీఎం ఖరారు

త్రిపుర రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేశారు. పార్టీ జాతీయ నాయకత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. అనంతరం బీజేఎల్పీ (BJLP) అత్యవసరంగా సమావేశమైంది. ఈ మీటింగ్ లో మాణిక్ సాహను నూతన సీఎంగా ఎన్నుకున్నారు. బీజేపీ త్రిపుర శాఖ అధ్యక్షులుగా కొనసాగుతున్న సాహ... రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వచ్చే సంవత్సరం త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. 

ప్రతి దానికి ఓ నిర్ణీత కాలం ఉంటుందని.. తాము ఆ కాలాన్ని బట్టి పని చేయడం జరుగుతుందని రాజీనామా చేసిన అనంతరం బిప్లబ్ కుమార్ మీడియాకు తెలిపారు. తనకు ఏ పదవి ఇచ్చినా.. బాధ్యతతో పని చేస్తానని, ముఖ్యమంత్రి పదవి అయినా.. వేరేదైనా.. తాను అందుకు తగినట్లు వ్యవహరిస్తానన్నారు. త్రిపురలో గత కొన్ని ఏళ్లుగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఉందనే సంగతి తెలిసిందే. ఈ పాలనకు తెరదించుతూ.. బీజేపీ ప్రభుత్వం 2018లో అధికారాన్ని చేజిక్కించుకుంది. రాష్ట్ర పదో ముఖ్యమంత్రిగా బిప్లబ్ కుమార్ ప్రమాణం చేశారు. ఆయనపై ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పించాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో సీఎంను మార్చాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించడం గమనార్హం. మరి మాణిక్ సాహ పాలన ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

మరిన్ని వార్తల కోసం : 

త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా

కొడుకు మరణంతో కోడలికి మరో పెళ్లి