త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతి బిశ్వాస్ రాజీనామా

త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతి బిశ్వాస్ రాజీనామా

అగర్తల: ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. త్రిపుర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడిగా ఉన్న పిజుష్ కాంతి బిశ్వాస్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని ఆయన ప్రకటించారు. శనివారం ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు పార్టీ నేత రాహుల్ గాంధీకి పంపించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో తనకు సహకరించినందుకు సోనియా, రాహుల్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

 త్రిపుర పీసీసీ చీఫ్ పదవికి ప్రద్యుత్ కిషోర్ మాణిక్య దేవుబర్మన్ రాజీనామా చేసిన తరువాత 2019 డిసెంబరులో త్రిపురలో ప్రముఖ న్యాయవాది అయిన బిశ్వాస్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అస్సాం నుండి మాజీ ఎంపీ, సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన కొన్ని రోజులకే త్రిపుర కాంగ్రెస్ చీఫ్ రాజీనామా ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. తాత్కాలికంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని ఆయన చెప్పినప్పటికీ కొంత విరామం తర్వాత ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

న్యాయవాదిగా ఆయన టీఎంసీ కోసం పనిచేస్తున్న ఎన్నికల వ్యూహకర్త పీకే గ్రూప్ కు చెందిన ఐ ప్యాక్ సభ్యుల కోసం కోర్టు పోరాటం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడి ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పుంజుకోవాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే త్రిపురలో బలం పెంచుకోవడానికి టీఎంసీ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పిజుష్ కూడా మంచి అదను చూసుకుని.. ఆ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వస్తున్నాయి.