Delhi Election 2025 : కేజ్రీవాల్, మమత బెనర్జీ పొత్తు

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్ధతిస్తున్నట్లు తృణమూల్ పార్టీ ప్రకటించింది. ఈ విషయం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిర్ధారించారు. కీలకమైన ఢిల్లీ ఎన్నికల్లో మద్ధతు ఇస్తున్నందుకు తృణమూల్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు కేజ్రీవాల్. బుధవారం (8 జనవరి 2025) తృణమూల్ పార్టీ తమ మద్ధతు ప్రకటించినట్లు కేజ్రీవాల్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. 

‘‘ఢిల్లీ ఎన్నికల్లో టీఎంసీ మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగతంగా టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీకి రుణపడి ఉన్నాను. థ్యాంకూ దీదీ. అన్ని వేళలా మాకు మద్ధతుగా ఉంటూ, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు దీదీ’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు అరవింద్ కేజ్రీవాల్. 

సమాజ్ వాదీ పార్టీ మద్ధతు కూడా ఆప్ కే:

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కు మద్ధతు ఇస్తున్నట్లు సమాజ్ వాదీ పార్టీ మంగళవారం (7 జనవరి 2025) మద్ధతు ప్రకటించింది. తమ పార్టీకి మద్ధతు ప్రకటించిన అఖిలేష్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్.

ALSO READ | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమన్న సీఈసీ

ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు వ్యవహార శైలి నచ్చడం లేదని దూరం జరిగింది. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ప్రారంభమైంది.
అధికార ఆప్ పార్టీ 2015, 2020 ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ కోటను కైవసం చేసుకుంది. 2015 లో 67 స్థానాలు, 2020లో 62 సీట్లను గెలిచి తిరుగులేని విజయం సాధించిన ఆప్.. ఈ సారి హాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో తృణమూల్, సమాజ్ వాదీ పార్టీలు మద్ధతు తెలపడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.