IND vs AUS 3rd Test: మరోసారి విలన్ అయ్యాడు: హెడ్ మెరుపు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ భారత క్రికెట్ జట్టుకు మరోసారి విలన్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లను అందరినీ కట్టడి చేస్తున్నా హెడ్ వికెట్ తీయడంలో భారత బౌలర్లు విఫలమవుతున్నారు. భారత బౌలింగ్ దళం అందరినీ పెవిలియన్ కు చేరుస్తున్న హెడ్ మాత్రం మన జట్టుకు కొరకరాని కొయ్యలా తయారవుతున్నాడు. అడిలైడ్ టెస్టులో సెంచరీతో భారత్ నుంచి మ్యాచ్ ను దూరం చేసిన ఈ విధ్వంసక ఆటగాడు ప్రస్తుతం జరుగుతున్న గబ్బా టెస్టులోనూ మెరుపు సెంచరీ చేసి ఆస్ట్రేలియా జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. 

115 బంతుల్లో 13 ఫోర్లతో హెడ్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ కెరీర్ లో హెడ్ కు ఇది 9 వ సెంచరీ. ఈ సిరీస్ లో రెండో సెంచరీ. ఈ మ్యాచ్ కు ముందు గబ్బాలో హెడ్ కు చెత్త రికార్డ్ ఉంది. అతను ఈ గ్రౌండ్ లో చివరి మూడు ఇన్నింగ్స్ ల్లో తొలి బంతికే ఔటయ్యాడు. హెడ్ సెంచరీతో పాటు స్మిత్ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. టీ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (103), స్టీవ్ స్మిత్ (65) క్రీజ్ లో ఉన్నారు. రెండో సెషన్ లో భారత్ కు ఒక్క వికెట్ కూడా లభించలేదు. 

3 వికెట్ల నష్టానికి 104 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన ఆస్ట్రేలియా పూర్తిగా ఆధిపత్యం చూపించింది. భారత బౌలర్లను ఒక ఆటాడుకుంటూ సునాయాసంగా పరుగులు సాధించారు. ముఖ్యంగా హెడ్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్ లో స్మిత్ హెడ్ కు చక్కని సహకారం అందించాడు. ఈ సెషన్ లో ఆస్ట్రేలియా మొత్తం 130 పరుగులు రాబట్టడం విశేషం. భారత బౌలర్లలో బుమ్రాకు రెండు వికెట్లు.. నితీష్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ దక్కింది. నాథన్ మెక్‌స్వీనీ (9), ఉస్మాన్ ఖవాజా(21),లబుషేన్(12) విఫలమయ్యారు. హెడ్, స్మిత్ నాలుగో వికెట్ కు అజేయంగా 159 పరుగులు జోడించారు.