IND vs AUS: కళ తప్పిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. ఇద్దరు ఆటగాళ్లదే ఆధిపత్యం

భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే ప్రతిసారి క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఎప్పటిలాగే ఈ సారి సిరీస్ ప్రారంభానికి అంతకు మించిన హైప్ నెలకొంది. కట్ చేస్తే.. ఈ సారి ఈ మెగా టోర్నీ చప్పగా సాగుతుంది. ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచ్ లు గమనిస్తే రెండే పేర్లు వినిపిస్తాయి. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రాతో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్. మూడు టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియా బ్యాటింగ్.. బుమ్రాకు మధ్య పోరు నడిచింది. మరోవైపు భారత బౌలర్లకు ట్రావిస్ హెడ్ కు మధ్య సమరం సాగింది. 

బ్యాటింగ్ లో హెడ్.. బౌలింగ్ లో బుమ్రా మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. వీరిద్దరూ మినహాయిస్తే మిగిలిన వారందరూ ఈ టోర్నీలో విఫలమయ్యారు. ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్ లు ఆడిన హెడ్.. రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ చేశాడు. సిరీస్ లో 3 టెస్టుల్లో 409 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్ లో హెడ్ మినహాయిస్తే మిగిలిన ఆసీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. తాజాగా ముగిసిన గబ్బా టెస్టులో 140 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

హెడ్ తర్వాత 235 పరుగులతో రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి మధ్య వ్యత్యాసం 174 పరుగులు ఉండడం విశేషం. మరోవైపు బుమ్రా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 10.90 సగటుతో 21 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. పెర్త్‌లో ఐదు వికెట్లు.. బ్రిస్బేన్‌లో తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీలను నాలుగు సార్లు అవుట్ చేశాడు. బుమ్రా తర్వాత మిచెల్ స్టార్క్ 14 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 7 వికెట్లు తేడా ఉంది. చివరి రెండు టెస్టులకైనా ఇరు జట్లు పోటాపోటీగా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.