ట్రస్మాలో 2 గ్రూపులు.. ఎవరికి వారే స్టేట్ కమిటీల ప్రకటన

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) రెండు గ్రూపులుగా విడిపోయింది. ఎవరికి వారు రాష్ట్ర కమిటీలను ప్రకటించుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఉండి రాజీనామా చేసిన ఓ వర్గం.. ఆదివారం ఆన్​ లైన్​లో ట్రస్మా స్టేట్ కమిటీ పేరుతో ఎన్నికలు నిర్వహించినట్టు ప్రకటించింది. దీంట్లో పాత నేతలే మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్టు పేర్కొన్నారు. దీన్ని మరో వర్గం తీవ్రంగా ఖండించింది. 

రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్ పోస్టులకు మాత్రమే రాజీనామా చేశారని, మొత్తం రాష్ట్ర కమిటీని రద్దు చేసే అధికారం లేదని ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి, స్టేట్ కన్వీనర్ ఐవీ రమణారావు, స్టేట్ స్పోక్ పర్సన్ జయసింహాగౌడ్ తెలిపారు. ట్రస్మాలో అవకతవకలపై హైకోర్టులో, రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసు నడుస్తున్నదని.. ఈ క్రమంలో ఈ నెల 29న జరిగిన ఆన్ లైన్ ఎన్నికలు చెల్లవని ప్రకటించారు. ఈ నెల 22న జరిగిన జనరల్ బాడీ  సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నట్టు వెల్లడించారు. జనవరి 8న కొత్త బాధ్యులు ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారని తెలిపారు.