ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌లు ఇంటికి వస్తలే.. సర్వీస్ నిలిపివేసిన పోస్టల్‌‌‌‌ శాఖ

  • రూ.2 కోట్ల మేర బకాయిలు చెల్లించకపోవడంతో సర్వీస్ నిలిపివేసిన పోస్టల్‌‌‌‌ శాఖ
  • రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌‌‌‌లోనే 40 వేలకార్డులు

కరీంనగర్, వెలుగు :  రవాణా శాఖ నుంచి జారీ చేస్తున్న వెహికల్‌‌‌‌ ఆర్సీలు, డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లు, ఇతర కార్డులు వాహనదారుల ఇండ్లకు చేరడం లేదు. రవాణా శాఖ చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.2 కోట్ల మేర పేరుకుపోవడంతో ఆ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు నవంబర్ 1 నుంచి రవాణాశాఖకు సర్వీసులు నిలిపివేశారు. దీంతో కార్డుల కోసం వాహనదారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ఏజెంట్లకు రూ. 500, రూ. 1000 ముట్టజెప్పి కార్డులు పొందాల్సి వస్తుంది. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో మూడున్నర వేలకుపైగా కార్డులు పెండింగ్‌‌‌‌లో ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకుపైగా కార్డులు పేరుకుపోయినట్లు తెలిసింది.

వాహనదారుల నుంచి ముందుగానే వసూలు చేస్తున్నా...

ఒరిజినల్‌‌‌‌ ఆర్సీ, లైసెన్స్‌‌‌‌లు, రెన్యూవల్‌‌‌‌, డూప్లికేట్‌‌‌‌ స్మార్ట్‌‌‌‌ కార్డులను వాహనదారుల ఇండ్లకు పోస్ట్‌‌‌‌లో పంపించేందుకు రవాణాశాఖ ఆఫీసర్లు అప్లికేషన్‌‌‌‌ టైంలోనే చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో కార్డుకు రూ. 35 చొప్పున వసూలు చేస్తున్న ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పోస్టల్‌‌‌‌ శాఖకు మాత్రం కార్డు బట్వాడాకు రూ.17, కవర్ చార్జీ కింద మరో రూపాయి మాత్రమే చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇలా గత ఏడాదిన్నరలో వాహనదారుల నుంచి రవాణా శాఖ సుమారు రూ.4 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో 16 నెలలకు సంబంధించిన బకాయిలు రూ.2 కోట్లను పోస్టల్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు చెల్లించకపోవడంతో ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఇబ్బందుల్లో వాహనదారులు

ఇటీవల ట్రాఫిక్‌‌‌‌, సివిల్‌‌‌‌ పోలీసుల తనిఖీలు ఎక్కువ అయ్యాయి. దీంతో ఆర్సీలు, డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లు లేకపోవడంతో వాహనదారులు రోడ్డెక్కాలంటేనే భయపడుతున్నారు. తగిన పత్రాలు లేకుండా రోడ్డెక్కుతుండడంతో ఫైన్లు, కేసుల పాలవుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బకాయిలు చెల్లించి తమకు స్మార్ట్‌‌‌‌కార్డులు అందేలా చూడాలని కోరుతున్నారు. 

బకాయిలు రిలీజ్ కాలేదు

పోస్టల్‌‌‌‌ శాఖకు సంబంధించిన బిల్లులు ఇంకా రిలీజ్‌‌‌‌ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. పోస్టల్‌‌‌‌ ఆఫీసర్లతో చాలా సార్లు మాట్లాడినా వారు పట్టించుకోవడం లేదు. బిల్లులు చెల్లిస్తేనే బట్వాడా చేస్తామంటున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

పురుషోత్తం, డీటీసీ, కరీంనగర్‌‌‌‌