ఫ్యాన్సీ నంబర్లతో కాసుల వర్షం .. ఈ ఏడాది రవాణా శాఖకు రూ.100 కోట్ల ఆదాయం

  • హైదరాబాద్, రంగారెడ్డిలో రూ.70 కోట్లు
  • మిగతా 8 ఉమ్మడి జిల్లాల నుంచి రూ. 30 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖపై ఫ్యాన్సీ నంబర్లు కాసుల వర్షం కురిపించాయి. జనవరి నుంచి డిసెంబరు వరకు రికార్డు స్థాయిలో రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 10  ఉమ్మడి జిల్లాల్లో 56 ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా అందులో రంగారెడ్డి, హైదరాబాద్  ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 ఆర్టీఏ కార్యాలయాల ద్వారా రూ.70  కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇందులోనూ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానిదే మొదటి స్థానం. 

ఈ ఒక్క ఆర్టీఏ ఆఫీసు నుంచే సుమారు రూ.30 కోట్ల ఆదాయం వచ్చింది. ఖైరతాబాద్  ఆర్టీఏ కార్యాలయం పరిధిలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్  వంటి ప్రాంతాలు ఉండడం, ఇక్కడ నివసించే వారు పెద్దపెద్ద వ్యాపార, పారిశ్రామికవేత్తలు, సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల కుటుంబాలు కావడంతో ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న డిమాండ్  రాష్ట్రంలోని మరే ఇతర ఆర్టీఏ కార్యాలయాంలోనూ లేదు. 

ఇటీవల 9999 నంబర్  కోసం ఓ పారిశ్రామికవేత్త రూ. 25 లక్షలు ఖర్చుచేసి ఆ నంబర్ ను సొంతం చేసుకున్నాడు. అయితే.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఫ్యాన్సీ నంబర్లకు పెద్దగా డిమాండ్  లేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత వరంగల్, కరీంనగర్  జిల్లాల్లో కొంత డిమాండ్ ఉంటోంది. మిగతా జిల్లాల్లో ఫ్యాన్సీ నంబర్ల రూ.25 వేల నుంచి రూ.2 లక్షలకు మించి పలకడం లేదు. కాగా ఈ ఏడాది ఫ్యాన్సీ నంబర్ల వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్న వారు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది వరకు ఉంటారని ఆర్టీఏ అధికారులు తెలిపారు. 

ఇందులో సుమారు 60 శాతంపైగా మంది హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల వారే అని అధికారులు చెప్పారు. ఈ లెక్కన దరఖాస్తు ఫీజుల రూపంలోనే రవాణా శాఖకు సుమారు రూ. 60 కోట్ల వరకు వచ్చింది. మొత్తానికి 2024 సంవత్సరంలో రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లతో రూ.100  కోట్లు రావడం రికార్డు అని అధికారులు అంటున్నారు.