ప్రభుత్వం- ప్రజల మధ్య దాపరికం సరికాదు

ప్రజాస్వామ్యంలో  పౌరుల  కేంద్రంగా ప్రభుత్వాలు పాలన సాగించవలసి ఉంటుంది.  ప్రజా అభిప్రాయాలు వారి అభీష్టాలకు అనుగుణంగానే పాలన ముందుకుసాగాలి.  ప్రజలు ఏం  కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. అంతేకానీ పాలకులు ఏం తలుస్తున్నారనేది  ప్రధానం కారాదు.  ప్రజల  అభిప్రాయాలను పరిగణనలోకి  తీసుకోకుండా ముందుకుసాగితే వృథా ప్రయాసలతో కూడుకున్న దండయాత్ర అవుతుంది.  నేడు  ప్రజలు తమకు  తెలియకుండా  ప్రభుత్వం దగ్గర  ఎలాంటి  రహస్యాలు ఉండకూడదని  కోరుకుంటున్నారు. 

 ప్రభుత్వం చేసే పనులను బహిర్గతం చేయాలని, అన్ని విషయాలను ప్రజల ముందు ఉంచాలని.  విద్యావంతులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు చాలా కాలమే ఉద్యమాలు కొనసాగించారు.  వారి పోరాటాల  ఫలితంగానే  కేంద్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో  సమాచార హక్కు చట్టం అమల్లోకి తీసుకువచ్చింది.  దీంతో  ప్రభుత్వ  పాటిస్తున్న రహస్యాలకు  తెరపడింది. 

 ఈ చట్టం అతి సాధారణ పౌరుని చేతిలో వజ్రాయుధంగా  మారింది.  పాలన వ్యవస్థలో  విప్లవాత్మకమైన మార్పులను తీసుకు రాగలిగినది.  ప్రభుత్వానికి ప్రజల మధ్య ఎలాంటి  దాపరికాలు ఉండకూడదని,  ప్రభుత్వం చేసిన ప్రతి పని ప్రజలకు తెలియపరచవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన పడింది.  ఈ చట్టం  ద్వారా  సాధారణ  పౌరుడు  సైతం  అత్యంత  సులభంగా  ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకునే అవకాశం ఏర్పడింది.  తద్వారా  పాలనలో  పారదర్శకత,  జవాబుదారీతనం  గణనీయంగా  పెరగడంతోపాటు,   ప్రజలు  కూడా  ప్రభుత్వం  చేస్తున్న  కార్యక్రమాలను  ఎప్పటికప్పుడు  తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు.  గతంలో కంటే  ప్రజలకి  ప్రభుత్వానికి మధ్య దూరం  తగ్గిపోయింది. ఇది  ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదం చేసిందని చెప్పాలి.

సమాచార బదిలీ ఇరువైపులా జరగాలి

క్షుణ్ణంగా పరిశీలిస్తే  కొంతకాలంగా ప్రభుత్వాల ఆలోచన విధానంలో  గుణాత్మకమైన  మార్పును మనం గమనించవచ్చు.  పరిపాలనలో,  వ్యవస్థలో  వచ్చిన మార్పులను అందిపుచ్చుకోవడంలో ప్రజలు సంపూర్ణంగా సఫలీకృతం కాలేకపోతున్నారు.  ప్రభుత్వం వైపు నుంచి  వచ్చిన మార్పులకనుగుణంగా  ప్రజల వైపు  నుంచి కూడా తగినవిధంగా  బాధ్యతాయుతమైన  మార్పు రావలసిన అవసరం అత్యావశ్యకంగా ఉంది.  ఇరువైపుల నుంచి  జరిగే  సమాచార బదిలీకి,   అభివృద్ధికి అవినాభావ  సంబంధం ఉంది.  

సమాచార  బదిలీ  విషయంలో  ఇరువైపుల నుంచి వేగంగా  మార్పు వచ్చినప్పుడే.. అంతేస్థాయిలో అభివృద్ధి కూడా  వేగంగా సాధ్యమవుతుంది.  ప్రజలు,  పౌర సమాజం  ప్రభుత్వంలో  రావాల్సిన మార్పుల గురించి చర్చిస్తున్నారు.  అంతేకాదు,  ప్రభుత్వమే తమకు అనుకూలంగా సమస్యలు పరిష్కరించాలని కోరుకోవటం పరిపాటి అయినది.  ప్రజాస్వామ్య  వ్యవస్థలో ఇది సాధారణమే.  కానీ,  తమవైపు నుంచి కూడా  అంతేస్థాయిలో  జవాబు దారీతనంతో కూడిన పాత్ర పెరగవలసిన అవసరం ఉందని ప్రజలు,  పౌర సమాజం గుర్తించాలి.

కులగణనకు  ప్రజలు సహకరించాలి

రాష్ట్ర  ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేకు ప్రజలందరూ సంపూర్ణంగా సహకరించవలసిన బాధ్యతాయుతమైన సందర్భం ఇది.  తొలిసారి  ప్రభుత్వం సదుద్దేశంతో చారి త్రాత్మకమైన  కులగణన సర్వేకు  శ్రీకారం చుట్టింది.  అనేకరకాల  సమస్యలకు  శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఈ సర్వేను ప్రభుత్వం చేపట్టింది. ఈ సర్వే దేశానికే రోల్ మోడల్ కాబోతోంది.  కాబట్టి,  ప్రజలు ఈ సర్వేపై   అపోహలు, భయాందోళనలు  పెట్టుకోవాల్సిన  అవసరం ఎంతమాత్రం  లేదు.  

ప్రజల స్థితిగతులను  తెలుసుకొని అందుకు అనుగుణంగా  ప్రణాళికలు  రూపొందించుకోవటానికి  కేంద్ర ప్రభుత్వం కూడా  ప్రతి  పది సంవత్సరాలకు ఒకసారి  జనాభా లెక్కల సేకరణ చేస్తోంది.   ఈ సర్వే  ఇంకా  సమగ్రమైనది.    కుల సర్వే చేయడం ఏ మాత్రం ఇష్టంలేని   కొన్ని రాజకీయ పార్టీలు,  కొన్ని వర్గాలవారు దురుద్దేశంతో  కావాలనే దుష్ప్రచారం చేస్తూ  ప్రజల్ని తప్పుదారి పట్టించడం శోచనీయం.

సమస్యల శాశ్వత  పరిష్కారానికే  సర్వే

మార్పును అంగీకరించని కొన్ని  శక్తులు కుట్ర పూరితంగానే ఇంటింటికి సర్వేకి వచ్చిన ఉద్యోగులకు ఇబ్బందులు కలిగించడం వారి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నది.    పౌరులు ఏ విధంగా  తమకు  కావలసిన సమాచారాన్ని ప్రభుత్వం  నుంచి  కోరుకుంటున్నారో  అదేవిధంగా  తమకు సంబంధించిన సామాజిక,  ఆర్థిక , విద్య,  ఉపాధి, రాజకీయ,  కుల వాస్తవ సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వవలసిన అవసరం ఉంటుందన్న బాధ్యతను  గుర్తించాలి. 

భవిష్యత్తులో  ప్రజల ఆకాంక్షలన్నీటికి అనుగుణంగా నిర్ణయాలు  తీసుకొని విజయం సాధించాలంటే ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వేకు విధిగా సంపూర్ణ  సహకారం అందించాలి.  ప్రభుత్వం ప్రజల నుంచి సమాచారం  తీసుకునేది   సమస్యలను శాశ్వతంగా  పరిష్కార మార్గాలను వెతకడం కోసమే.  ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని ఏ  ప్రభుత్వం భావించదు.  సమాజ అభివృద్ధి అనేది ఇరువైపుల నుంచి జరిగే ఖచ్చితమైన, వాస్త వికమైన సమాచార బదిలీపైనే ఆధారపడి ఉంటుందన్న విషయం మనం గమనించాలి.  ప్రజాస్వామ్యంలో  ఇచ్చిపుచ్చుకునే  ధోరణితోనే  ప్రజలకు,  ప్రభుత్వానికి  విజయాలు సిద్ధిస్తాయి.

– నాగుల వేణు యాదవ్, అసిస్టెంట్ ప్రొఫెసర్-