-
అలాంటి సీడ్స్‌కు స్వస్తి పలికేలా కేంద్రం చూడాలి
-
జీఎం విత్తనాలతో ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదం
-
హైదరాబాద్ లోరౌండ్ టేబుల్ సమావేశం
-
దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధుల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: జన్యు మార్పిడి విత్తనాలతో రైతు విత్తన స్వాతంత్ర్యాన్ని కోల్పోవడంతో పాటు విత్తనాలు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తాయని దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. సహజత్వానికి భిన్నంగా జరిగే జన్యుమార్పిడి విధానాన్ని అనుమతించబోమని వారు పేర్కొన్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి అధ్యక్షతన జన్యుమార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జన్యుమార్పిడి పంటలపై జాతీయ విధానాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ సదస్సు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. జన్యుమార్పిడి విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులతో పాటు వినియోగదారులను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. జన్యుమార్పిడి పంటల ఆలోచన విధానానికి స్వస్తి పలికేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు.
జన్యుమార్పిడి పంటలతో ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికీ తీవ్రంగా ప్రమాదం వాటిల్లుతుందన్నారు. స్వయంశక్తి, ప్రకృతి పరిరక్షణతో కూడిన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. గడిచిన పదేళ్లలో దేశంలో ఎలాంటి సంప్రదింపులు లేకుండా చట్టాలు తెచ్చారని అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ తరువాతే విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశం ఇచ్చిందని గుర్తుచేశారు. బీటీ వంకాయ విషయంలో 2010లో ప్రజలతో సంప్రదింపులు కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాయన్నారు.
విదేశీ కంపెనీల గుత్తాధిపత్యం పెరిగింది
వనరుల దోపిడీ, ఆహార ఉత్పత్తుల్లో మితిమీరిన రసాయన వినియోగం, జీవరాశులకు హాని కలిగించే టెక్నాలజీని విడనాడాలని రైతు సంఘాల ప్రతినిధులు సూచించారు. పత్తి విత్తన మార్కెట్ లో బేయర్, మోన్సాంటో వంటి విదేశీ కంపెనీల గుత్తాధిపత్యం పెరిగిందని, ఆ కార్పొరేట్లకు రైతులు దాదాపు రూ.10 వేల కోట్ల రాయల్టీ చెల్లించారని తెలిపారు. బీటీ పత్తితో దేశంలో పత్తి దిగుబడి పెరగలేదని, మెరుగుపడలేదని, రసాయనాల వాడకాన్ని తగ్గించలేదన్నారు. దానికి భిన్నంగా రసాయన ఎరువుల వాడకం గణనీయంగా పెరిగిందని, కాయతొలుచు పురుగులతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు కోదండ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నల్లమల వెంకటేశ్వర రావు, రైతు స్వరాజ వేదిక సంఘం ప్రతినిధులు కవిత, కె.రవి, తమిళనాడు రైతు సంఘం ప్రతినిధులు పీఎన్ పాండ్యన్, సుందర విమల నందన్, కర్ణాటక రైతు సంఘం ప్రతినిధి బాలకృష్ణన్, కేరళ రైతు సంఘం ప్రతినిధులు బిజు, ఉష, ఏపీ రైతు సంఘం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం నాయకులు సాగర్, భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.