బిజినెస్ డెస్క్, వెలుగు: కొన్ని సార్లు పొరపాటున ఇతరుల బ్యాంకు అకౌంట్‌కి డబ్బులు పంపించేస్తాం. కానీ, వాటిని ఎలా తిరిగి డబ్బులు పొందాలో అర్థం కాదు.తప్పుడు డిటైల్స్ వలన మన అకౌంట్‌లో డబ్బులు కట్ అయిపోతే తిరిగి పొందడానికి కొన్ని మార్గాలున్నాయి.
వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి..
తప్పు అకౌంట్ నెంబర్‌కు డబ్బులు పంపితే వెంటనే సంబంధిత బ్యాంకుకు ఈ విషయం గురించి చెప్పాలి. పొరపాటున వేరే అకౌంట్‌కు ఎలా డబ్బులు పంపించారో వివరించాలి. కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేసి మొత్తం డిటైల్స్‌ను చెప్పాలి. ఈ–మెయిల్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన డిటైల్స్‌ను బ్యాంక్ కోరితే పంపాలి. ట్రాన్సాక్షన్ జరిగిన డేటు, టైమ్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, డబ్బులు పంపిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ డిటైల్స్‌ను ప్రొవైడ్ చేయాలి.
సేమ్ బ్యాంక్ అయితే..
డబ్బులు పొరపాటుగా పంపిన బ్యాంక్ అకౌంట్ కూడా మీ బ్యాంకుకు చెందిందే అయితే దిగులు పడాల్సిన పనిలేదు. బ్రాంచ్ మేనేజర్‌కు ఈ విషయం గురించి చెబితే కొన్ని రోజుల్లోనే మీ డబ్బులు తిరిగి మీ అకౌంట్‌లోకి వస్తాయి. అదే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పుగా ఇవ్వడం వలన లేదా పంపిన అకౌంట్ నెంబర్ వాడుకలో లేకపోతే ట్రాన్స్‌ఫర్ అయిన డబ్బులు ఆటోమెటిక్‌గారీఫండ్ అవుతాయి.
ఇతర బ్యాంకుకు చెందిన అకౌంట్ అయితే..
డబ్బులు పొరపాటున పంపిన అకౌంట్ వేరే బ్యాంక్‌కు చెందినది అయితే కొద్దిగా ఇబ్బందులు తప్పువు. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులు కనీసం రెండు నెలల టైమ్ తీసుకుంటాయి. పొరపాటున మనీ పంపిన బ్యాంక్ అకౌంట్‌కు చెందిన బ్రాంచును కలవొచ్చు. ఎవరికి డబ్బులు పంపారో ఆ వ్యక్తిని సంబంధిత బ్యాంక్ బ్రాంచు కాంటాక్ట్ అవుతుంది. ఆ పర్సన్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు.
డబ్బులు ఇవ్వకపోతే..
పొరపాటున వేరే అకౌంట్‌కు పంపిన డబ్బులను ఆ అకౌంట్ హోల్డర్ తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోతే కోర్టుకి వెళ్లొచ్చు. ఈ ప్రాసెస్‌లో బ్యాంకులకు సంబంధం ఉండదు. ఈ సమస్యను కోర్టులో పరిష్కరించుకోవాల్సిందే. బెనిఫిషియరీ డిటైల్స్ తప్పుగా ఉంటే ఆ ట్రాన్సాక్షన్ బాధ్యత బ్యాంకులపై ఉండదు. తాజాగా డబ్బులు ఎవరికైన సెండ్ చేసిన తర్వాత ఒక మెసేజ్ వస్తోంది. ట్రాన్సాక్షన్ తప్పుగా జరిగితే ఈ నెంబర్‌కు మెసేజ్ చేయాలని చెబుతూ ఇందులో ఒక నెంబర్ కూడా ఉంటుంది. ఇలా మెసేజ్‌లు పంపమని ఆర్‌బీఐ బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. పొరపాటున రాంగ్ అకౌంట్‌కు డబ్బులు పంపితే బ్యాంకులు వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
