ఏపీలో ఘోరం..ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఎనిమిది మంది కూలీలు మృతి

  • అనంతపురం జిల్లాలోఘోరం..కూలీల ఆటో, బస్సు ఢీ..ఎనిమిది మంది మృతి
  • సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి 
  • రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటన
  • బస్సు డ్రైవర్ అరెస్టు

హైదరాబాద్, వెలుగు ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్  వద్ద కూలీలు ప్రయాణి: స్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 8 మంది మృతి చెందారు. ఐదుగురికి తీవ్రగాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కల్లూరు మండలం నెల్లుట్ల  గ్రామానికి చెందిన 13 మంది కూలీలు గార్లదిన్నెలో పొలం పనులకు వెళ్లారు. 

పనులు ముగించుకొని తిరిగి ఆటోలో వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ధర్మవరం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఆ ఆటోను ఢీకొట్టింది. స్పాట్ లో ఇద్దరు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. 

మార్గం మధ్యలో మరో ద్దరు, చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీశ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.