హైదరాబాద్లో విషాదం.. అప్పు చేసి ఇల్లు కట్టాడు.. తీర్చలేక ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు..

రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ నగర శివారులోని గండిపేటలో విషాదం చోటుచేసుకుంది. మల్లికార్జున్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. మల్లికార్జున్ ఆర్తనాదాలు విని మంటలు స్థానికులు హుటాహుటిన వెళ్లి మంటలను ఆర్పి కాపాడే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 80 శాతం కాలిన గాయాల కారణంగా చికిత్స పొందుతూ మల్లిఖార్జున్ చనిపోయాడు.ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

లంగర్ హౌస్ నుంచి గండిపేటకు వెళ్లి మల్లికార్జున్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల లంగర్ హౌస్లో మల్లిఖార్జున్ ఇల్లు నిర్మించాడు. ఇంటి నిర్మాణానికి డబ్బులు అప్పుగా తెచ్చినట్లు తెలిసింది. అప్పు డబ్బులు తిరిగి చెల్లించలేక పోయిన మల్లికార్జున్ ఒత్తిడికి లోనయ్యాడు. కొన్ని రోజుల నుంచి డిప్రెషన్తో బాధపడుతున్నాడు. ఇవాళ(జనవరి 2న) ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుని కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టేశాడు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అప్పులు చేసి మరీ ఇల్లు కట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మేలు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ‘ఇల్లు కట్టలేం.. కొనలేం’ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సిమెంట్‌‌‌‌, స్టీల్‌‌‌‌, ఇటుక, ఇసుక, టైల్స్.. ఇలా అన్నింటి రేట్లు పెరిగిపోతుండటంతో ఇల్లు కట్టుకోవడం తలకు మించిన భారమవుతోంది. ధరలకు రెక్కలు రావడంతో ఇండ్ల నిర్మాణ వ్యయం అంచనాలు తారుమారు అవుతున్నాయి. సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లు.. ఫ్లాట్‌‌ కొనుక్కోవాలనుకునే వాళ్లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.

పెరుగుతున్న ధరల నేపథ్యంలో చిన్న, మధ్య తరహా బిల్డర్లలో చాలా మంది నిర్మాణ రంగం నుంచి వెళ్లిపోతున్నారు. మరికొందరు తాత్కాలికంగా పనులను ఆపేశారు. దాదాపు10 వేల మంది బిల్డర్లు పనులకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పెద్ద బిల్డర్లు మాత్రమే నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక వ్యక్తిగత ఇండ్ల నిర్మాణాలు చాలా వరకు నిలిచిపోతున్నాయి. రేట్లు తగ్గుతాయేమోనని జనం ఎదురుచూస్తున్నారు.