చండీగఢ్: ఉదయం 8 గంటలకు ఆరోజు ఆమెకు డ్యూటీ పడింది. కానీ, ఇంట్ల పనులను చక్కబెట్టుకుని, చంటిపాప పనులను చూసుకునే సరికే ఆ టైం అయిపోయింది. పెద్దసారు నుంచి ఫోన్.. వెంటనే వచ్చెయ్యమని ఆర్డర్. పాపం ఆమె మాత్రం ఏం చేస్తుంది.. చేతిలో బిడ్డను పట్టుకుని పరుగుపరుగున వెళ్లి డ్యూటీ ఎక్కింది. ఎండలోనే నడి రోడ్డులో డ్యూటీ చేసింది. ఆమె ఓ ట్రాఫిక్ పోలీస్. గత్యంతరం లేని పరిస్థితుల్లో బిడ్డతోనే ఆమె డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఆ బాటన పొయ్యే ఒకాయన వీడియో తీసి ట్విట్టర్లో పెట్టేసరికి అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటన చండీగఢ్లోని సెక్టర్29 వద్ద ట్రాఫిక్ లైన్లో జరిగింది. ఆ మహిళా పోలీస్ పేరు ప్రియాంక. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు భేష్ అంటే.. ఇంకొందరు ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయొద్దంటూ కామెంట్ చేశారు. మహిళా శక్తి అంటే ఇది అంటూ కొందరు ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో ఇటు ఇల్లు, అటు ఆఫీసులో పిల్లల సంరక్షణకు అస్సలు ప్రోత్సాహం అందట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసే మహిళలకు పిల్లల బాగోగులను చూసుకునే దిశగా ప్రభుత్వం నుంచి సరైన మద్దతు అందడం లేదన్నది ఈ వీడియోతో స్పష్టమవుతోందని విమర్శించారు.
