దేశంలోనే పొడవైన హైవే పై రాకపోకలకు తిప్పలు

దేశంలోనే పొడవైన హైవే పై రాకపోకలకు తిప్పలు

మెదక్/మనోహరాబాద్, వెలుగు: అది దేశంలోనే అతి పొడవైన నేషనల్ హైవే. రాత్రి పగలు తేడా లేకుండా రోజూ వేలాది వెహికల్స్ తో రూట్​ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇంత ముఖ్యమైన హైవే మీద చేపట్టిన రైల్వే ఓవర్​ బ్రిడ్జి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. దీంతో భారీ వర్షం పడితే చాలు టెంపరరీగా నిర్మించిన అండర్ పాస్​లోకి నీరు చేరి హైదరాబాద్ –- నాగపూర్ హైవేపై రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. గంటల తరబడి భారీగా ట్రాఫిక్​ జాం అయి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు రైలు సౌకర్యం కోసం సికింద్రాబాద్​–- ముత్కేడ్​రూట్​లోని మెదక్​ జిల్లా మనోహరాబాద్​నుంచి సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి  వరకు రైల్వే లైన్​నిర్మిస్తున్నారు. మధ్యలో నేషనల్​ హైవే 44 అడ్డుగా ఉండటంతో రైల్వే ఓవర్​బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు దాదాపు నాలుగేళ్ల కిందట సెంట్రల్​ గవర్నమెంట్​రూ. 100 కోట్లు శాంక్షన్​చేసింది. సర్వే, ఎస్టిమేషన్​ల తయారీ, టెండర్, అగ్రిమెంట్​ ప్రాసెస్​కు ఏడాది టైం పట్టింది. 2018లో ఆర్వోబీ పనులకు శంకుస్థాపన చేశారు. నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎన్ హెచ్​ఏఐ) ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. మనోహరాబాద్ స్టేషన్​ నుంచి గజ్వేల్​వైపు రోడ్డు మీద నుంచి కొత్త రైల్వే ట్రాక్​ వేశారు. ఈ క్రమంలో నేషనల్​హైవే మీద నుంచి రాకపోకలు సాగించే వెహికల్స్​కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా మెదక్​జిల్లా రామాయిపల్లి వద్ద హైవేకు రెండు వైపులా అండర్​పాస్​ నిర్మించారు. 
వరద నీరు పోయే దారిలేక.. 
ఆర్వోబీ నిర్మాణం పూర్తయ్యేవరకు హైవే మీద ఇటు హైదరాబాద్, అటు నాగపూర్​ వైపు  రాకపోకలు సాగించే వెహికల్స్​అన్నీ ఈ అండర్​పాస్​ నుంచే వెళ్లాలి. అయితే  అధికారుల ప్లానింగ్​లోపం వల్ల పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసినపుడు చుట్టుపక్కల నుంచి వరద నీరు వచ్చి రామాయిపల్లి వద్ద నిర్మించిన అండర్​పాస్​లోకి చేరుతోంది. మనోహరాబాద్​ రైల్వే స్టేషన్​, రామాయిపల్లి  ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు అండర్​పాస్​వైపు రాకుండా దారి మళ్లించే ఏర్పాట్లు చేయాల్సి ఉండగా ఆ పనులు చేయలేదు. దీంతో వర్షం కురిసినప్పుడల్లా అండర్​పాస్​ వరద నీటితో నిండిపోతోంది. గతేడాది వానాకాలంలో ఇలాగే జరగగా, ఈసారీ అదే పరిస్థితి నెలకొంది. కార్లు మునిగిపోయేంత లోతు నీరు నిలుస్తుండడంతో వెహికల్స్​రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో రద్దీగా ఉండే 44వ నంబర్ నేషనల్​హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. 
స్లోగా పనులు
నేషనల్​హైవే మీద చేపట్టిన ఆర్వోబీ పనులు ఇంకా పిల్లర్ల స్టేజిలోనే ఉన్నాయి. పనులు చాలా స్లోగా జరుగుతుండటంతో ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఆర్వోబీ కంప్లీట్​అయితేగానీ హైవే మీద వెహికల్స్​రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోవు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్​హెచ్​ఏఐ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్వోబీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.