నియోజకవర్గానికి ఒక ట్రాఫిక్ అవేర్‌‌నెస్ పార్క్

  •  రూ. 3 లక్షల వ్యయంతో ఏర్పాటుకు చర్యలు    
  •   సీఎస్‌ఆర్ ఫండ్ నుంచి ఏర్పాటు చేయాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు:  విద్యార్థి దశ నుంచే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ట్రాఫిక్ అవేర్‌‌నెస్ పార్కుల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఈ అవేర్‌‌నెస్ పార్కులు ఏర్పాటు చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. మొదటి దశలో ఒక్కో అసెంబ్లీ నియోజవకర్గం పరిధిలో ఒక్కో పార్కును ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయడంపై రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు. కంపెనీల నుంచి వచ్చే సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్ నుంచి ఈ నిధులను ఖర్చు చేయాలని సర్కార్ నిర్ణయించింది.

జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో రవాణా, పోలీసు, మున్సిపల్, విద్యా, ఆర్ అండ్ బీ అధికారుల సమన్వయంతో ఈ పార్కులను ఏర్పాటు చేసేలా విధి విధానాలను సిద్ధం చేసింది. ఒకటి, రెండు రోజుల్లో అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లనున్నాయి. సుమారు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ. 3 లక్షల వ్యయంతో ఒక్కో పార్కు ఏర్పాటు కానుంది. హైదరాబాద్ లో ఇప్పటికే పది స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని మిగతా వాటికి మార్గదర్శకంగా నిలిచేలా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చర్యలు తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు పెరుగుతుండటం, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతుండడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ పార్కులను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పార్కులతో పిల్లల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచడం ద్వారా  రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని సర్కారు భావిస్తోంది.