మలయాళీల నూతన సంవత్సరం నేడే

మలయాళీల నూతన సంవత్సరం నేడే

కేరళ వ్యాప్తంగా ఓనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన దేశంలో సమైక్యత పొంపొంది, ప్రజల మధ్య సోదరభావం వర్థిల్లాలని కాంక్షిస్తూ పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళి సై, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, పీఎంకే వ్యవస్థాపకుడు డా. రాందాస్‌, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్‌, సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ తదితరులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు.

ఓనం పండుగ సందర్భంగా ఎర్నాకులంలోని వామనమూర్తి గుడిలో ఓనం వేడుకలు కొనసాగుతున్నాయి. వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తుల రద్దీ కన్పిస్తుంది. మలయాళీల నూతన సంవత్సరమైన ఓనం ఉత్సవాలు కోజికోడ్ లోనూ ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కోజికోడ్ ఇండోర్ స్టేడియాన్ని పూలతో అలంకరించారు. కేరళ సంస్కృతి ఉట్టిపడేలా..స్టేడియం నిర్వాహకులు పూలతో, రంగోలితో తీర్చిదిద్దారు .

ముఖ్యంగా ఓనం పండుగను 10 రోజులు చేసుకుంటారు.  మొదటి రోజును అతమ్‌గా... చివరి రోజైన పదో రోజును తిరు ఓనంగా పిలుస్తారు. ఈ 10 రోజుల ఈ పండగలో ఈ రెండు రోజులను మాత్రం కేరళ ప్రజలు చాలా ముఖ్యమైన రోజులుగా భావిస్తారు. ఈ పండగ సందర్భంగా కేరళ ప్రజలు పది రోజుల పాటు వారసత్వంగా వచ్చిన సంప్రదాయాలను ప్రతిబింబించేలా, అవి ప్రపంచానికి తెలిసేలా అద్భుతంగా జరుపుకుంటారు. కేరళ ప్రజలందరూ ఎంతో శ్రద్ధతో చేసే ఈ పండుగను 1961 లో కేరళ జాతీయ పండుగగా అక్కడి ప్రభుత్వం గుర్తించింది.