కిలో టమాటా  రూ.200 అవుతుందా..? ఇదిగో సంకేతాలు..

కిలో టమాటా  రూ.200 అవుతుందా..? ఇదిగో సంకేతాలు..

కొండెక్కిన టమాటాల ధరలు కిందికి దిగి రావడం లేదు. స్థానికంగా పంట ఉత్పత్తి తగ్గగా, ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో దిగుబడి లేదు. మార్చి, ఏప్రిల్‌, మేలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటంతో ఇక్కడి రైతులు సాగు తగ్గించారు. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో టమాటాలకు బాగా డిమాండు పెరిగింది.

సామాన్య, మధ్యతరగతి వాళ్లు ప్రస్తుతం కూరగాయలు కొనాలంటేనే భయం వేస్తోంది. ముఖ్యంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా టమాటా ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా ఈ సీజన్ లో టమాటా ధర చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో బాక్స్ ధర రూ. 500 లోపే ఉంటుంది. కానీ.. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఇందుకు కారణం డిమాండ్ కు తగట్లు సప్లై లేకపోవడమే అంటున్నారు వ్యాపారులు. గత రెండు నెలల క్రితం రైతులు టమాటా పంటను నమ్ముకొని తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో చాలా మంది రైతులు టమాటా సాగు కాకుండా ఇతర పంటలకు వైపు మొగ్గు చూపారు. 

ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి మార్కెట్ లో ఒక కిలో టమాటా అత్యధికంగా124 రూపాయల ధర (హోల్ సేల్) పలికింది. ఇవే టమాటాలు మదనపల్లి నుంచి హైదరాబాద్ కు రావాలంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు రావాలంటే కనీసం ఒక కిలోకు దాదాపు 50 రూపాయల వరకు ఖర్చు కాకుండా ఉంటుందా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

హైదరాబాద్ లోని వివిధ మార్కెట్లకు ప్రతిరోజూ సుమారు 1500 టన్నుల వరకు టమాటాలు దిగుమతి అవుతుంటాయి. అయితే.. ప్రస్తుతం750 టన్నుల టమాటాలు మాత్రమే హైదరాబాద్ లోని వివిధ మార్కెట్లకు సరఫరా అవుతున్నాయి. అంటే సగానికి సగం టమాటాలు రాక తగ్గిపోయిందని చెప్పొచ్చు. దీంతో వ్యాపారులు.. వచ్చిన సరుకును వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారు. 

హైదరాబాద్ మార్కెట్ లో ‘ఏ’ గ్రేట్ టమాటా హోల్ సేల్ ధర కిలో130 రూపాయలు పలుకుతోంది. ఇది రిటైల్ దగ్గరకు వచ్చే సరికి 150 రూపాయలు దాటుతోంది. రాబోయే 20 రోజుల వరకు కొత్త సరుకు రాదంటున్నారు. అంటే జులై నెల మొత్తం టమాటా ధరలు తగ్గే పరిస్థితులు లేకపోగా.. వచ్చే టమాటా సైతం రోజురోజుకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మదనపల్లి నుంచి టమోటా సరుకు ఎక్కువగాహైదరాబాద్ కు  వస్తుంటుంది. అక్కడే ప్రస్తుతం కిలో టమాటా 124 రూపాయల ధర పలడటం రికార్డు అని చెబుతున్నారు.