బీసీలను అన్యాయం చేసి గొంతు కోసిండ్రు.. బీఆర్ఎస్‎పై మహేష్ గౌడ్ ఫైర్

హైదరాబాద్: కవిత రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.  బీఆర్ఎస్​పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కి.. ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించిన్నట్లుగా ఉందని విమర్శించారు. బీసీ ధర్నా చేయాలని నిర్ణయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత బీసీలకు బీఆర్ఎస్​పాలనలో చేసిన అన్యాయాలపై  సమాధానం చెప్పిన తర్వాత, ధర్నా చేయాలన్నారు. ఈ మేరకు  పలు ప్రశ్నలతో ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. కవిత బీసీల పేరిట కపట నాటకం మొదలు పెట్టారని విమర్శించారు. పదేండ్లు బీసీలను పట్టించుకోకుండా.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని ఫైర్​అయ్యాడు. ‘బీసీలకు అన్యాయం చేసి గొంతు కోసింది బీఆర్ఎస్​పార్టీ. లిక్కర్​స్కాంలో మరకంటించుకున్న కవిత దాన్ని పోగొట్టుకోవడానికి బీసీ డ్రామా చేస్తుంది. ఫస్ట్​బీఆర్ఎస్​పార్టీ అధ్యక్షులుగా బీసీ నేతకు అవకాశం ఇవ్వండి.. తర్వాత ధర్నా చేయాలి. 

ALSO READ | మెట్రో పనుల్ని ఎప్పటిలోపు కంప్లీట్​ చేస్తరు..? ఎమ్మెల్యే కేపీ వివేకానంద

కాంగ్రెస్  బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం నాకు పీసీసీ చీఫ్‏గా పదవి ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నం.  వారికి మరింత ప్రయోజనకరంగా ఉండేలా సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి ధర్నా చేపట్టడం దురదృష్టకరం. బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చర్యలు, ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనలో చేపట్టిన చర్యలపై కవిత  బహిరంగ చర్చకు సిద్ధమా’ అని పీసీసీ చీఫ్​ సవాల్ చేశారు.