Sri Krishna Janmashtami 2024 : ఇండియాలో ప్రసిద్దిగాంచిన కృష్ణుని దేవాలయాలు ఇవే..

దక్షిణాయనంలో శ్రావణమాసం కృష్ణపక్షం అర్థరాత్రి అష్టమి తిథి రోహణి నక్షత్రంలో జన్మించాడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడు జన్మభూమి అయిన మధుర,బృందావనంలో కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటుతాయి...దక్షిణాది రాష్ట్రాల్లోనూ శ్రీ కృష్ణుడికి అద్భుతమైన ఆలయాలున్నాయి. ప్రతి ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఆ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయి.. ఆగస్టు 26 కృష్ణాష్టమి సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం. 

 నెమలి.. ఆంధ్రప్రదేశ్​.. స్వయంభువుగా స్వామివారు...

1953 మార్చి 23 న (శ్రీరామనవమి నాడు) వేణుగోపాలస్వామి నెమలిలో స్వయంభుగా వెలిశారు. స్వామివారి విగ్రహం నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు తన పొలంలోని సారవంతమైన మట్టి కోసం తవ్వుతుండగా మొదటిసారి గడ్డపలుగు ఉపయోగించగా వెంటనే ఖంగుమని శబ్దం వచ్చింది. ఆ వింత ధ్వని అర్ధం కాక కొంచెం పక్కగానే గడ్డపలుగు వేయగా అదే శబ్దం వచ్చింది. ఆ ధ్వని ఆలోచించుతూనే అతడు ఆ రెండు ఘతాముల మధ్య మరల పలుగు ప్రయోగించగా ఆ చోట బ్రహ్మాండమైన మిరుమిట్లుతో ఒక మెరుపు వెలువడింది. ఆ కాంతి తీవ్రతకు అతను మూర్చ పోయాడు అది చూసిన మిగిలిన వారు ఆందోళనతో అతని ముఖం పై చల్లని నీళ్ళు చల్లి కొద్ది సేపు సపర్యలు చేసారు. ఆతను కొంచెం తేరుకొని తనకు ఏమి కనిపించడంలేదని అన్నాడు. అపుడు మిగిలినవారంతా ఆప్రాంతంలో త్రవ్వి చూడగా ఒక విగ్రహం దానిచెంతనే ప్రాచీన శంఖము, పాచిక లభ్యమయినది. ఆరోజు పరమ పవిత్రమైన శ్రీరామనవమి (23‌‌–-3-–1953) ఆవిషయం తెలిసిన షావుకారు నవమి వేడుకల నిర్వహణలో ఉన్న ఆతను ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించి హుటాహుటీన తన అనుచరులతో కలిసి విగ్రహం లభ్యమైన దివ్యస్తలానికి చేరుకున్నాడు. ఆ విగ్రహమును పరిశీలించి శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తి అని గ్రహించారు.

​శ్రీకృష్ణ మఠం - ... కర్ణాటక

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఉడిపి శ్రీకృష్ణుడి అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటి.  మధ్వాచార్యులు 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. సముద్రం మధ్యలో మునిగిపోతున్న ఓపడవను ఒడ్డుకు చేర్చిన మధ్వాచార్యులు అందుకు ప్రతిగా అందులో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అడిగి తీసుకున్నాడు. ఆ విగ్రహం ఇంకేదో కాదు..దేవకి కోరిక మేరకు దేవశిల్పితో రుక్మిణి చెక్కించిన విగ్రహం. అలా ఆ విగ్రహం సముద్రం ద్వారా ఉడిపి వచ్చి చేరింది. ఇక్కడ బాలకృష్ణుడిని కిటికీ నుంచి దర్శించుకోవాలి. తన భక్తుడైన కనకదాసుడికి స్వామివారు ఈ కిటికీ నుంచి దర్శనం ఇచ్చారని అప్పటి నుంచి అలాగే అందరూ దర్శించుకుంటున్నారు. ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. కిట్టయ్య జన్మతిథి సందర్భంగా ‘విట్టల్ పిండి’ పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించి ఊరేగించి ఆ తర్వాత ఆలయంలో ఉన్న సరోవరంలో నిమజ్జనం చేస్తారు. 

​గురువాయూర్ ....  - కేరళ

దక్షిణ భారతదేశంలో శ్రీ కృష్ణుడి ఆలయాలు అధికంగా ఉన్న రాష్ట్రం కేరళ అనే చెప్పుకోవాలి. ఇక్కడ అన్నిటికన్నా ప్రసిద్ధమైన దేవాలయం గురువాయూర్. దీనినే దక్షిణ ద్వారక అంటారు. ఇక్కడ విగ్రహాన్ని దేవగురు బృహస్పతి..వాయుదేవుడి సహాయంతో ప్రతిష్టించాడని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ ప్రాంతాన్ని గురువాయూర్ అని పిలుస్తారు.  దీన్ని భూలోక వైకుంఠంగా అభివర్ణిస్తారు భక్తులు. ఈ ఆలయంలో కృష్ణుడు  నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. ఇక్కడ  జన్మాష్టమి, డోలాపూర్ణిమ, విషు, కుచేల దినోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. చిన్నారులకు ఇక్కడ అన్నప్రాసన చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని భక్తుల విశ్వాసం. 

పార్థసారథి ఆలయం... - తమిళనాడు

చెన్నై నగరంలోని పార్థసారథి ఆలయంలో విష్ణువుకు సంబంధించిన నాలుగు అవతారాలను ప్రత్యేకంగా పూజిస్తారు. ఇందులో రాముడు,  కృష్ణుడు, నారసింహుడు, వరాహాస్వామిని పూజిస్తారు.   శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. పార్థుడు అయిన అర్జునుడి రథానికి సారధి వహించినవాడు కాబట్టే..పార్థసారథి అని పిలుస్తారు.. 

బృందావనం..  ఉత్తర ప్రదేశ్

శ్రీ కృష్ణ జన్మభూమి అయిన మధుర..కన్నయ్యను ఆరాధించే పుణ్యక్షేత్రాల్లో ఒకటి. 50 అడుగుల ఎత్తైన ద్వాదశాదిత్య శిల‌పై  ఉన్న శ్రీ రాధా మదన్ మోహన్ మందిరాన్ని బృందావనంలో నిర్మించిన మొదటి ఆలయం అని చెబుతారు. ఆలయ గర్భగుడిలో కృష్ణుడు, రాధ, బలరాముని  విగ్రహాలతో పాటు పాలరాతి  కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ప్రధాన ఆలయం వెనుక చిన్న గది ఉంటుంది..ఇదే అప్పట్లో కృష్ణుడు జన్మించిన  జైలు అని చెబుతారు. జన్మాష్టమితో పాటూ చప్పన్ భోగ్, హోలీ వేడుకలు బాగా జరుపుతారు. మధుర నుంచి బృందావనం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోవిందదేవ్‌, మీరాబాయి దేవాలయాలున్నాయి. బృందావనానికి సమీపంలో  గోవర్ధన పర్వతం...అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో  రాధా కుండ్/ శ్యామ్ కుండ్ ఉంది. గోపికలు శ్రీ కృష్ణుడి రాకకోసం ఎదురుచూసిన ప్రదేశం ఇది అని చెబుతారు.  

ద్వారక... గుజరాత్

శ్రీ కృష్ణుడి మహిమాన్విత పుణ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి. కృష్ణుడు పరిపాలించిన ద్వారకలో వేల సంవత్సరాలక్రితం నిర్మించిన ద్వారకాధీశుడి దేవాలయం దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రధాన విగ్రహం నల్ల పాలరాతితో చెక్కి ఉంటుంది. కౌస్తుభ మణి, లక్ష్మీదేవి బహుమతిగా ఇచ్చిన దండతో ఈ విగ్రహాన్ని అలంకరించారు.  చాళుక్య శైలి నిర్మాణానికి నిదర్శనంగా ఈ ఆలయం నిలుస్తుంది. ఏటా జన్మాష్టమికి  ఇక్కడ నిర్వహించే వేడుకలు చూసేందుకు లక్షలాది భక్తులు పోటెత్తుతారు. ద్వారక సమీపంలో దర్శించుకునేందుకు చాలా ప్రదేశాలున్నాయి.  

పూరీ ...ఒడిశా

సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలసి కృష్ణుడు కొలువైన క్షేత్రం పూరీ. సప్త మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటైన పూరీలో అడుగడుగునా మిస్టరీలే. ఏటా ఆషాఢమాసంలో జరిగే రథయాత్ర అత్యంత ప్రత్యేకం. ఇక కృష్ణాష్టమి వేడుకలు ఈ ఆలయంలో వైభవంగా జరుగుతాయి. ఇంకా జైపూర్, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణుడికి ఎన్నో ప్రముఖ ఆలయాలున్నాయి...